శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 06, 2020 , 02:52:55

రక్షణరంగంలో దూసుకెళ్దాం

రక్షణరంగంలో దూసుకెళ్దాం
  • వచ్చే ఐదేండ్లలో రూ.35వేల కోట్ల ఎగుమతులు లక్ష్యం
  • ప్రధాని మోదీ వెల్లడి.. డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020 ప్రారంభం
  • భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని విదేశీ సంస్థలకు పిలుపు

లక్నో: వచ్చే ఐదేండ్లలో 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.35,000 కోట్లు) రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని విదేశీ రక్షణ తయారీ సంస్థలను ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బుధవారం ఆయన 11వ ద్వైవార్షిక ‘డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నిర్దిష్ట విధానాలు కొరవడడం వల్ల గత కొన్ని దశాబ్దాలుగా  భారత్‌ రక్షణ ఉత్పత్తులకు అతిపెద్ద దిగుమతిదారుగా మిగిలిందని చెప్పారు. గత ఐదేండ్లలో దేశంలో రక్షణ రంగ లైసెన్సులు 210 నుంచి 460కి పెరిగినట్లు చెప్పారు. ‘భారత్‌లో తయారీ.. భారత్‌ కోసం.. ప్రపంచం కోసం’ అన్నదే తమ స్ఫూర్తిమంత్రమని పేర్కొన్నారు. 2014లో భారత రక్షణ ఎగుమతుల విలువ రూ.2వేల కోట్లు ఉండగా, గత రెండేండ్లలో అది రూ.17,000 కోట్లకు చేరుకుందని ప్రధాని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో దాన్ని రూ.35,000 కోట్లకు పెంచడమే లక్ష్యమని వెల్లడించారు. 

  

రక్షణ రంగంలో కృత్రిమ మేధ

సాంకేతికత దుర్వినియోగం, ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లని, వీటిని ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలు సరికొత్త సాంకేతికతపై దృష్టిసారించాయని ప్రధాని తెలిపారు. రక్షణ రంగంలో కృత్రిమ మేధ వినియోగానికి ఇప్పటికే రోడ్‌మ్యాప్‌ ఖరారైందని వెల్లడించారు. రక్షణ బలగాల అధిపతితోపాటు మిలిటరీ వ్యవహారాల విభాగాన్ని ఏర్పాటుచేయడం ద్వారా రక్షణ ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు. ‘మన సైనిక సన్నద్ధత.. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకుని కాదు. ప్రపంచ శాంతికి భారత్‌ తన వంతు కృషిచేస్తున్నది. మనదేశంతోపాటు సరిహద్దు దేశాల భద్రత బాధ్యత కూడా మనపై ఉన్నది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. 


డిఫెన్స్‌ ఎక్స్‌పోలో బీడీఎల్‌ స్టాల్‌


డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020లో భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆర్మీ చీఫ్‌, జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె బుధవారం ప్రారంభించారు. ఈ ఎక్స్‌పోలో బీడీఎల్‌ తన ఉత్పత్తులను ప్రదర్శించడం ఇదే తొలిసారి. దీనిలో గైడెడ్‌ క్షిపణి ఆయుధాలు, సముద్రాల్లో వాడే ఆయుధాలు, గగనతలంలోని సుదూర లక్ష్యాలను చేధించే ఆయుధాలు, వాటి విడిభాగాలు ఉన్నాయి. తొలిసారిగా చాట్‌బోట్‌, ఇండస్ట్రీ 4.0, అమేగా-3, కృత్రిమ మేధకు చెందిన ఆయుధాలను తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది.


logo