బుధవారం 03 జూన్ 2020
National - Jan 15, 2020 , 02:16:12

అసాధ్యాలు సుసాధ్యమవుతున్నాయి

అసాధ్యాలు సుసాధ్యమవుతున్నాయి
  • దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నది
  • విద్రోహ శక్తులే అశాంతిని సృష్టిస్తున్నాయి
  • తుగ్లక్‌ పత్రిక కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

చెన్నై, జనవరి 14: దేశం అభివృద్ధిలో అత్యంత వేగంగా దూసుకుపోతున్నదని, అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతున్నాయని.. కానీ కొ న్ని స్వార్థ శక్తులే ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అశాంతిని సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. చెన్నైలో తమిళ పత్రిక ‘తుగ్లక్‌' మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వీడియో ద్వారా ప్రసంగించారు. తమ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు భారత ఆర్థిక, సామాజిక సమగ్రతకు దోహదపడ్డాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీపై పరోక్షంగా విమర్శలు సంధిస్తూ, దేశాన్ని పాలించేందుకు అవకాశం వచ్చిన కొం దరు కొన్ని అంశాల పట్ల అనిశ్చితిని కొనసాగించారన్నారు. కానీ తమ హయాంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే మిషన్‌ను తమ ప్రభుత్వం చేపట్టిందని ప్రధాని చెప్పారు. ఆయన తమ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను వివరించారు.

ఈ మార్పులను జీర్ణించుకోలేని కొన్ని స్వార్ధ వక్తులు దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తూ అలజడి సృష్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీర పౌర జాబితా వంటి వాటికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ విమర్శలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ‘తుగ్లక్‌' వంటి పత్రికలు ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఈ సందర్భంగా తుగ్లక్‌ పత్రిక స్థాపకుడు చో రామస్వామిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. దేశ అభివృద్ధి పథాన్ని భారతీయులే నిర్దేశించి, నూతన శిఖరాలకు దేశాన్ని చేరుస్తారని ప్రధాని పేర్కొన్నారు. మన దేశ ఉన్నతమైన నాగరికత పురోగతికి ప్రజల మధ్య సామరస్యం, భిన్నత్వం, సోదరభావం కారణమని చెప్పారు. భారతీయులు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా వారిని ఆపలేరని అన్నారు. గత ఐదేండ్ల తమ పాలన ఈ నమ్మకాన్ని బలపరిచిందని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న ప్రజలు కొన్ని సదుపాయాలను స్వచ్ఛందంగా వదులుకున్నారని మోదీ గుర్తు చేశారు. సీనియర్‌ పౌరులు తమ రైల్వే రాయితీలను వదులుకున్నారని, కొందరు తమ పెన్షన్‌ను స్వచ్ఛ భారత్‌ కోసం విరాళమిచ్చారని, మరికొందరు సబ్సిడీపై వంటగ్యాస్‌ను తీసుకోవడం మానివేశారని చెప్పారు. ఈ స్ఫూర్తిని ప్రభుత్వాలు, మీడియా సంస్థలు గౌరవించాలని అన్నారు.


ప్రజాస్వామిక దేశాలు ప్రపంచ కూటమిగా ఏర్పడాలి

-డెన్మార్క్‌ ప్రధాని పిలుపు ఢిల్లీలో ప్రారంభమైన ‘రైసినా డైలాగ్‌'
ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక అంశాలపై భారత్‌ నిర్వహిస్తున్న ప్రపంచస్థాయి సదస్సు ‘రైసినా డైలాగ్‌ (సంభాషణ)’ మంగళవారం ఢిల్లీలో మొదలైంది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, ఆఫ్ఘన్‌లో శాంతి చర్యలు, వాతావరణ మార్పులు వంటి సవాళ్లపై ఆయా దేశాల అధినేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరైన ప్రారంభ కార్యక్రమంలో డెన్మార్క్‌ ప్రధాని ఆండర్స్‌ రాస్ముస్సెన్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామిక దేశాలు ప్రపం చ కూటమిగా ఏర్పడి నియంతల పాలనను ఎదిరించాలన్నారు. ఈ కూటమిలో భారత్‌ ముఖ్య పాత్రను పోషించగలదని చెప్పారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ‘వ్యూహాత్మక ఇరుసు’లాంటిదని ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో రగులుకున్న కార్చిచ్చు వల్ల మారిసన్‌ ఈ సదస్సుకు హాజరు కాలేకపోయారు. సదస్సు అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ ‘రైసినా డైలాగ్‌కు హాజరయ్యాను. పలువురు నాయకులను, మన దేశాన్ని ప్రేమించే గొప్ప స్నేహితులను కలుసుకున్నాను.

ముఖ్యమైన అంతర్జాతీయ, వ్యూహాత్మక అంశాలను చర్చించే గొప్ప వేదిక ఇది’ అని పేర్కొన్నారు. ఈ సదస్సులో న్యూజిలాండ్‌ ప్రధాని హెలెన్‌ క్లార్క్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్‌ హార్పర్‌, స్వీడన్‌ మాజీ ప్రధాని కార్ల్‌ బిల్ట్‌, భూటాన్‌ మాజీ ప్రధాని షేరింగ్‌ టోబ్‌గే, దక్షిణ కొరియా మాజీ ప్రధాని హాన్‌ సెవింగ్‌ సూ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచీకరణకు సంబంధించి నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, 2030 ఎజెండా, ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. 


logo