గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 01:11:26

గ్రామాలను కాపాడుకుందాం

గ్రామాలను కాపాడుకుందాం

  • ఇప్పుడదే మన ముందున్న అతిపెద్ద సవాల్‌
  • కరోనా కట్టడిలో రాష్ర్టాల చర్యలు భేష్‌
  • లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని చోటే సమస్యలు
  • కరోనాపై పోరుకు సమన్వయ వ్యూహం అవసరం
  • రాష్ర్టాల సూచనలను బట్టే భవిష్యత్‌ కార్యాచరణ
  • సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, మే 11: గ్రామీణ ప్రాంతాల్లోకి కరోనా మహమ్మారి అడుగుపెట్టకుండా అడ్డుకోవడమే ప్రస్తుతం దేశం ముందున్న అతిపెద్ద సవాల్‌ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. కరోనాపై పోరుతోపాటు, ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు ‘సమన్వయ వ్యూహాన్ని’ అన్వేషించి, అమలుచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో మూడో విడుత లాక్‌డౌన్‌ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. కరోనా కట్టడి, ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణపై ముఖ్యమంత్రులతో సమగ్రంగా చర్చించారు. కరోనా విజృంభణ తర్వాత సీఎంలతో సమావేశం కావడం ఇది ఐదోసారి. కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. మహమ్మారి నుంచి భారత్‌ తనను తాను రక్షించుకోగలిగిందని యావత్‌ ప్రపంచం భావిస్తున్నదని చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు, వలస కార్మికుల తరలింపు నేపథ్యంలో మహమ్మారి గ్రామాల్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని, అదే మన ముందున్న అతిపెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెమ్మదిగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో ఇవి మరింత పుంజుకుంటాయని చెప్పారు. నిర్ణీత దూరం, లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు పాటించని చోటే సమస్యలు పెరిగాయని తెలిపారు. ‘లాక్‌డౌన్‌లో ప్రజలు ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండాలని మనం నొక్కి చెప్పాం. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇండ్లకు వెళ్లాలనుకోవడం మానవ సహజం. కాబట్టి, మన నిర్ణయాలను మార్చుకోవాల్సింది’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు.

15లోగా అభిప్రాయాలు చెప్పండి...

కరోనాపై సమన్వయ వ్యూహం అవసరమని, రాష్ర్టాలు వెలిబుచ్చే అభిప్రాయాల ఆధారంగానే భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని ప్రధాని స్పష్టంచేశారు. కరోనా వ్యాప్తిరేటు తగ్గించడంతోపాటు ప్రజా కార్యకలాపాలను క్రమంగా పెంచడంపై దృష్టిసారించాలన్నారు. లాక్‌డౌన్‌పై 15లోగా అభిప్రాయాలు తెలియజేయాలని సీఎంలను కోరారు. రైళ్లను పునఃప్రారంభించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని ప్రధాని పేర్కొన్నారు. అయితే పరిమిత స్థాయిలోనే సర్వీసులు నడుస్తాయని చెప్పారు.

ఆ అధికారం రాష్ర్టాలకు ఇవ్వాలి...

ఢిల్లీలో కంటైన్మెంట్‌ జోన్లు మినహా, మిగిలిన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతివ్వాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించాలని కోరారు. అయితే ఎగ్జిట్‌ (ఆంక్షల ఎత్తివేత) వ్యూహాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, రాష్ర్టాలకు ఆర్థిక సాయాన్ని అందించాలని విజ్ఞప్తిచేశారు. రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లను నిర్ణయించే అధికారం రాష్ర్టాలకే వదిలిపెట్టాలని కోరారు. లాక్‌డౌన్‌పై స్పష్టమైన మార్గాన్ని చూపాలని, దాన్నే తాము పాటిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ప్రధానికి సూచించారు. తమ రాష్ట్ర సిబ్బందికి కాస్త విశ్రాంతినిచ్చేలా కేంద్ర బలగాలను పంపాలని కోరారు. అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలన్నారు. తమ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెలాఖరు వరకు రైలు, విమాన సర్వీసులకు అనుమితించొద్దని ప్రధానికి తమిళనాడు సీఎం పళనిస్వామి విజ్ఞప్తిచేశారు. 

కేంద్రానికి మాపై ఎందుకీ కక్ష?


ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేం ద్రం రాజకీయాలు చేస్తున్నది. కరోనా విషయంలో బెంగాల్‌ను రాజకీయంగా టార్గెట్‌ చేసుకున్నారు. మా అభిప్రాయాలను ఎప్పుడూ ఎవరూ కోరలేదు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలి. ఎప్పుడూ బెంగాల్‌పైనే ఎందుకు విమర్శలు? ఒకవైపు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని అంటారు. మరోవైపు, రైళ్లను ప్రారంభిస్తారు. -మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్‌ సీఎం


పటిష్ఠ పర్యవేక్షణ మధ్య రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు అనుమతించాలి. సూ క్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించాలి.

-పినరాయి విజయన్‌,కేరళ ముఖ్యమంత్రి


కంటైన్మెంట్‌ జోన్ల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలి. వేసవి సెలవుల తర్వాతనే విద్యాసంస్థలను తెరువాలి. ప్రజారవాణాను నెమ్మదిగా ప్రారంభించాలి. 

-విజయ్‌ రూపానీ, గుజరాత్‌ సీఎంlogo