మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 21, 2020 , 09:56:08

కోవిడ్ టీకా పంపిణీ.. అధికారుల‌తో మోదీ స‌మీక్ష‌

కోవిడ్ టీకా పంపిణీ.. అధికారుల‌తో మోదీ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌:  కోవిడ్ టీకా అభివృద్ధి, పంపిణీకి సంబంధించి వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక రూపొందించే అంశంపై ప్ర‌ధాని మోదీ ఉన్న‌త స్థాయి అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.  శుక్ర‌వారం ఈ స‌మావేశం జ‌రిగింది.  నీతి ఆయోగ్ అధికారులు కూడా ఆ భేటీలో పాల్గొన్నారు.  దేశంలో జ‌రుగుతున్న కోవిడ్ టీకా అభివృద్ధి, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అంశాల‌ను ఆ స‌మావేశంలో చ‌ర్చించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.  వ్యాక్సిన్ అభివృద్ధిలో జ‌రుగుతున్న పురోగ‌తితో పాటు.. అనుమ‌తులు ఎలా ఇవ్వాలి,  టీకాల‌ను ఎంత మేర‌కు ప్రొక్యూర్ చేయాల‌న్న అంశాల‌ను ప‌రిశీలించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  ఒక‌వేళ టీకా మార్కెట్‌లోకి విడుద‌ల అయితే, అప్పుడు ఎవ‌రెవ‌రికి ముందుగా కోవిడ్ టీకాను ఇవ్వాల‌ని, కోల్డ్ చైన్ నిల్వ‌లు ఎలా ఉన్నాయో కూడా సంగ్ర‌హించిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు కంపెనీలు కరోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం టీకాను త‌యారు చేస్తున్నాయి. ప‌లు దేశాల్లో వివిధ ద‌శ‌ల్లోనూ ఆ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ సాగుతున్నాయి.  కొన్ని టీకాలు అడ్వాన్స్‌డ్ ద‌శ‌లో ఉన్నాయి.  ఇండియాలో అయిదు వ్యాక్సిన్లు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  భార‌తీయ కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ల‌తో జ‌త‌క‌ట్టేందుకు బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్‌, ఖ‌తార్‌, భూటాన్‌, స్విట్జ‌ర్లాండ్‌, బ‌హ్రెయిన్‌, ఆస్ట్రియా, ద‌క్షిణ కొరియా దేశాలు ఆస‌క్తిగా ఉన్నాయి.  టీకా జారీ అంశంలో హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల డేటాబేస్‌ను ప్ర‌భుత్వం త‌యారు చేసింది. టీకాల నిల్వ‌‌కు కావాల్సిన కోల్డ్ చైన్ల‌ను,  సిరంజీల‌ను, సూదుల‌ను కూడా ప్ర‌భుత్వం ప్రొక్యూర్ చేస్తున్న‌ది.