గురువారం 02 జూలై 2020
National - Jan 14, 2020 , 03:37:22

పాలనలో మోదీ-షా విఫలం

పాలనలో మోదీ-షా విఫలం
  • సీఏఏ, ఎన్నార్సీపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు
  • మతం ఆధారంగా విభజన.. అసలు సమస్యలు వెనక్కి
  • సోనియా ఆగ్రహం.. కేంద్రాన్ని ప్రతిపక్షాలు ఎండగట్టాలని పిలుపు
  • ఢిల్లీలో సమావేశమైన 20 ప్రతిపక్ష పార్టీల నేతలు
  • ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, తృణమూల్‌, ఆప్‌, శివసేన గైర్హాజరు

న్యూఢిల్లీ, జనవరి 13: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)పై అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ప్రజలను పాలించడం, వారికి రక్షణ కల్పించడం చేతకాదని వారు నిరూపించుకున్నారని విమర్శించారు. ప్రజలను మతం ఆధారంగా విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. దాదాపు 20 పార్టీలకు చెందిన నేతలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం కనీవినీ ఎరుగని సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తూ, విద్వేషాన్ని వ్యాప్తిచేస్తూ ప్రజలను మతం ఆధారంగా విభజించాలని చూస్తున్నదని ఆరోపించారు. యూనివర్సిటీల్లో హింస చెలరేగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జేఎన్‌యూ, జామియా మిలియా, అలహాబాద్‌, అలీగఢ్‌, బనారస్‌ హిందూ వర్సిటీ తదితర యూనివర్సిటీల్లో ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందన్నారు.

ప్రస్తుతం సీఏఏకి, ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత రోడ్లమీదికి వచ్చిందని, వీరికి అన్నివర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ప్రస్తుత ఉద్యమానికి సీఏఏ, ఎన్నార్సీ తక్షణ కారణమే అయినా, వ్యవస్థపై ప్రజల్లో కొన్నేండ్లుగా గూడుకట్టుకొని ఉన్న ఆగ్రహం ఈ విధంగా బయటపడిందని వివరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువతను పోలీసులు లక్ష్యంగా చేసుకొన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల ప్రవర్తన క్రూరంగా ఉన్నదని ఆరోపించారు. మొత్తంగా తాము ప్రజలకు రక్షణ కల్పించలేమని, పాలించడం చేతకాదని మోదీ-అమిత్‌ షా నిరూపించుకుంటున్నారని సోనియాగాంధీ ఎద్దేవా చేశారు. సీఏఏ, ఎన్నార్సీపై వారిద్దరూ తరుచూ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని, జాతీయ దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. అసోంలో ఎన్నార్సీ విఫలం కావడంతో ఇప్పుడు జాతీయ జనాభా పట్టికను (ఎన్పీఆర్‌) ప్రతిపాదిస్తున్నారని, మరికొన్ని నెలల్లో దీని అమలు ప్రారంభం కావొచ్చని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ఎన్నార్సీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అభివృద్ధి మందగించిందని సోనియాగాంధీ ఆరోపించారు. దేశంలోని అన్నివర్గాల ప్రజలు, ముఖ్యంగా పేదలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని చెప్పారు. మోదీ, అమిత్‌ షా ఈ అంశాలపై మాట్లాడలేక, వాస్తవ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.


దమ్ముంటే వర్సిటీలకు వెళ్లండి: రాహుల్‌

ప్రధాని మోదీకి దమ్ముంటే దేశంలో నెలకొన్న సమస్యలపై యూనివర్సిటీల్లోని విద్యార్థులతో చర్చించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సవాల్‌ విసిరారు. ఆయన విభజన రాజకీయాలను అమలుచేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులను ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదని అందుకే పోలీసులను ఉపయోగించి వారిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.


ఆరు ప్రధాన పార్టీలు గైర్హాజరు

కాంగ్రెస్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి ఆరు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, డీఎంకే గైర్హాజరయ్యాయి. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుండటం, కాంగ్రెస్‌ కూడా ఒక ప్రధాన పోటీదారు కావడంతో ఆప్‌ ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

సీఏఏను ఉపసంహరించాలి

కేంద్ర ప్రభుత్వం వెంటనే సీఏఏను ఉపసంహరించుకోవాలని, ఎన్పీఆర్‌ కసరత్తును తక్షణం నిలిపివేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఇవి రాజ్యాంగవిరుద్ధమని, పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని రూపొందించారని విమర్శించాయి. ఎన్నార్సీకి మరో రూపమే ఎన్పీఆర్‌ ఆని.. దీనిని అందరూ వ్యతిరేకించాలని నిర్ణయించాయి. బీజేపీ ప్రమాదకరమైన విభజన రాజకీయం చేస్తున్నదని మండిపడ్డాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ నెల 23న సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా, 30న గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నేతలు మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌గాంధీ, గులాం నబీ ఆజాద్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, జేఎంఎం నేత, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, ఎల్జేడీ చీఫ్‌ శరద్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత మనోజ్‌ షా, ఎన్సీ నేత హస్నేన్‌ మసూదీ, ఆర్‌ఎల్‌ఎస్పీ నేత పేంద్ర కుశ్వాహ తదితరులు హాజరయ్యారు. 


logo