శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 02:35:20

ఐరాసకు పునర్జన్మ!

ఐరాసకు పునర్జన్మ!

  • కరోనా కల్లోలం ఆ అవకాశాన్ని కల్పించింది ప్రపంచానికి అనుగుణంగా తీర్చిదిద్దాలి 
  • ఐరాస ఆర్థిక మండలి సమావేశంలో మోదీ 

న్యూయార్క్‌: నేటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితిని సంస్కరించాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ పరిణామాల నుంచి ఐరాస పురుడు పోసుకుందని, ఇప్పుడు కరోనా మహమ్మారి పరిస్థితులు ఐరాసకు పునర్జన్మ కల్పించాల్సిన, సంస్కరించాల్సిన అవసరాన్ని ఏర్పరిచాయని చెప్పారు. ఐరాస సామాజిక, ఆర్థిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఐరాసను స్థాపించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నేటి ప్రపంచంలో ఐరాస పాత్ర, ప్రాసంగితను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఐరాస పుట్టుక నుంచి ఇప్పటివరకు అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, సభ్యదేశాల సంఖ్య 193కి చేరుకున్నదని చెప్పారు. అలాగే సంస్థపై అంచనాలు కూడా పెరిగాయన్నారు. అదే సమయంలో బహుళత్వవాదం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదన్నారు. ‘బహుళత్వవాదం ద్వారానే సుస్థిర శాంతి, సుసంపన్నత సాధ్యమని భారత్‌ విశ్వసిస్తున్నది. అయితే ఈ బహుళత్వవాదం నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించాల్సిన అవసరం ఉన్నది’ అని ప్రధాని స్పష్టంచేశారు. ఐరాస, బహుళత్వవాదం సంస్కరణలతోనే మానవ ఆకాంక్షలను సుసాధ్యం చేసేందుకు వీలవుతుందన్నారు. ప్రపంచ బహుముఖీయ వ్యవస్థను సంస్కరించేందుకు ప్రతినబూనాలని ప్రపంచదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి భారత్‌ అత్యంత కీలక సమయంలో ఎన్నికైందని చెప్పారు. శాంతి, సామరస్యత, ఆర్థిక-సామాజిక సమానత్వం, ప్రకృతి సమతుల్యతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో 150 దేశాలకుపైగా భారత్‌ ఔషధాలు సరఫరా చేసిందని మోదీ చెప్పారు.


logo