బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 03:03:53

సుప్రీం తీర్పులకు ప్రజామద్దతు

సుప్రీం తీర్పులకు ప్రజామద్దతు
  • అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య న్యాయవ్యవస్థ సమతుల్యత
  • డేటా భద్రత, సైబర్‌ నేరాలతో సవాళ్లు
  • అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధానమంత్రి మోదీ
  • చట్టబద్ధపాలన విజయవంతానికి న్యాయవ్యవస్థే కీలకం: సీజేఐ బోబ్డే

న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన పలు క్లిష్టమైన తీర్పులను 130 కోట్ల మంది భారతీయులు హృదయపూర్వకంగా స్వాగతించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ‘న్యాయవ్యవస్థ- మారుతున్న ప్రపంచం’ పేరిట సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్య కేసు తదితర తీర్పులను ఈ సందర్భంగా ప్రధాని పరోక్షంగా ప్రస్తావించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటిస్తూ న్యాయవ్యవస్థ పర్యావరణ ధర్మశాస్ర్తాన్ని పునర్‌నిర్వచించిందని ప్రశంసించారు. మానవ మేధస్సుకు కృత్రిమ మేధను జోడించడం ద్వారా సత్వర న్యాయం అందించవచ్చన్నారు. డేటా భద్రత, సైబర్‌ నేరాలు న్యాయవ్యవస్థకు సరికొత్త సవాళ్లను విసురుతున్నాయని చెప్పారు. లింగ సమానత్వం లేనిదే ప్రపంచంలోని ఏ దేశం  సమగ్ర అభివృద్ధిని సాధించలేదని ప్రధాని చెప్పారు. తమ ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్‌ తలాక్‌ చట్టం, ట్రాన్స్‌జెండర్‌, దివ్యాంగుల హక్కుల చట్టాలను ఆయన ప్రస్తావించారు. మిలిటరీ సర్వీసుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. సత్యం, సేవకే గాంధీజీ జీవితాన్ని అంకితం చేశారని, ఆయన చూపిన మార్గమే న్యాయవ్యవస్థకు పునాది అన్నారు. 


ప్రాథమిక విధులను నిర్వర్తించాలి: జస్టిస్‌ బోబ్డే 

సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఆధునిక రాజ్యాంగాలలో చట్టబద్ధపాలన అన్నది ప్రాథమిక విషయమని, అయితే సవాళ్లకు ఆయా న్యాయవ్యవస్థలు స్పందించే తీరుపై దాని విజయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పౌరులు తమ ప్రాథమిక విధులను తప్పక నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. రాజ్యాంగం బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థను నెలకొల్పిందని, దాన్ని చెక్కుచెదరకుండా ఉంచేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. భారత్‌కు 2000 ఏండ్ల న్యాయ చరిత్ర ఉన్నదని పేర్కొన్న ఆయన.. వ్యాసస్మృతి గురించి ప్రస్తావించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదులు, అవినీతిపరులకు గోప్యత హక్కు ఉండదని, అలాంటి వ్యక్తులు వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమన్నారు. 


ఉగ్రవాదం, సైబర్‌ నేరాలపై న్యాయవ్యవస్థ స్పందించాలి: జస్టిస్‌ ఎన్వీ రమణ

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు, పర్యావరణ క్షీణత, ఆరోగ్య సమస్యలు నేడు ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయని, వీటిపై న్యాయవ్యవస్థ తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మన తీర్పులపై ప్రపంచ దేశాల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. భారత న్యాయశాస్ర్తాన్ని అధ్యయనం చేసిన ఆస్ట్రేలియా న్యాయమూర్తి జస్టిస్‌ మైఖెల్‌ కిర్బీ.. తమదేశ హైకోర్టు తీర్పుల్లో అనేకమార్లు మన తీర్పులను ప్రస్తావించారని తెలిపారు. రాజ్యాంగ నైతికతను అనుసరించి, సందర్భానుసారం సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు రాజ్యాంగానికి అర్థం చెబుతున్నదని పేర్కొన్నారు. బహుళవాదంపై న్యాయవ్యవస్థ పాత్ర మీద సదస్సులో చర్చించాలన్నారు. పాపులిస్ట్‌ నిర్ణయాలు రాజ్యాంగ హక్కులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. 


ప్రధాని మోదీపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ‘ప్రపంచం మెచ్చిన దార్శనికుడు’, ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని కొనియాడారు.

జాతీయవాదం, ‘భారత్‌ మాతా కీ జై’ వంటి నినాదాలు దుర్వినియోగం అవుతున్నాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి, మిలిటెంట్ల ఆలోచనలకు ఒక సాధనంగా వీటిని ఉపయోగిస్తున్నారు.  భారత్‌ ప్రభావవంతమైన ప్రజాస్వామ్యంగా, ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా ఉండటానికి దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూనే కారణం.  ఒక వర్గం ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నది. అయితే, చరిత్ర అసత్యాలను తిరస్కరిస్తుంది. 

మన్మోహన్‌ సింగ్‌, మాజీ ప్రధాని


 కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌ గాంధీ తిరిగి చేపట్టాలని పార్టీలోని మెజారిటీ వర్గం కోరుకుంటున్నది. పార్టీని నడిపించడానికి ఆయనే సరైన వ్యక్తి. పార్టీలో ఇప్పటికీ రాహుల్‌ అగ్రనేతే. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‘పరివర్తన దశ’లో ఉన్నది. పార్టీలో నాయకత్వ కొరత లేదు. కాంగ్రెస్‌కు చుక్కానిగా సోనియాగాంధీ ఉన్నారు. రాహుల్‌పై ఎవ్వరూ ఒత్తిడి తీసుకురావొద్దు. నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు సమయమివ్వాలి. 

సల్మాన్‌ ఖుర్షీద్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత


logo
>>>>>>