గురువారం 02 జూలై 2020
National - Jan 12, 2020 ,

మమత ఇలాకాలో మోదీ

మమత ఇలాకాలో మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసనలతో స్వాగతం పలికింది.

  • పశ్చిమబెంగాల్‌లో ప్రధాని పర్యటన
  • నిరసనలతో స్వాగతం పలికిన సీఎం, టీఎంసీ
  • రాజ్‌భవన్‌లో ప్రధానితో మమత భేటీ

కోల్‌కతా, జనవరి 11: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసనలతో స్వాగతం పలికింది. అనంతరం రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ, బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ భేటీ అయ్యారు. ప్రధాని శనివారం ఢిల్లీ నుంచి కోల్‌కతాలోని ఎన్‌ఎస్‌సీ బోస్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్‌ హకీం, బీజేపీ బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. సీఎం మమతా బెనర్జీ హాజరుకాలేదు. అనంతరం మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఇటీవల ఆధునీకరించిన కోల్‌కతాలోని పాత కరెన్సీ బిల్డింగ్‌, బెల్వదెరె హౌస్‌, మెట్కాల్ఫె హౌస్‌, విక్టోరియా మెమోరీహాల్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతోపాటు చారిత్రక హౌరాబ్రిడ్జీ వద్ద ఏర్పాటు చేసిన సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ వ్యవస్థను ప్రారంభించారు. రాత్రి బేళూరులోని రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రంలో బస చేశారు. ఆదివారం వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. 

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ విరమించుకోండి 

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై పునరాలోచించుకోవాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. దీంతోపాటు రాష్ర్ట్టానికి కేంద్రం నుంచి దాదాపు రూ.28వేల కోట్ల నిధులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. ఈ అంశాలపై చర్చించేందుకు తనను ఢిల్లీకి రావాల్సిందిగా ప్రధాని కోరారని చెప్పారు. అనంతరం ఆమె నేరుగా రాణి రష్మోని రోడ్‌లో టీఎంసీ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నార్సీని అమలు చేయబోమన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్‌పై స్పం దిస్తూ... సీఏఏ ఇకపై కాగితాలకే పరిమితమవుతుందన్నారు. మరోవైపు ప్రధానితో మమ త భేటీని కాంగ్రెస్‌, వామపక్షాలు తప్పుబట్టాయి. మమత ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోమన్‌ మిత్రా విమర్శించారు. బెంగాల్‌లో బీజేపీకి అనుబంధ సంస్థగా టీఎంసీ పనిచేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ, టీఎంసీ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందని, మమత కేంద్రానికి సహాయపడుతున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు మహ్మద్‌ సలీం విమర్శించారు. 

గోబ్యాక్‌ పీఎం 

సీఏఏను రద్దు చేయాలని, మోదీ గో బ్యాక్‌ అంటూ టీఎంసీ కార్యకర్తలు విమానాశ్రయం వద్ద నినాదాలు చేశారు. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, గోల్‌పార్క్‌, కాలేజ్‌ స్ట్రీట్‌ తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.


బెంగాల్‌లో రూ.84 కోట్ల రైల్వే ఆస్తులు ధ్వంసం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల రూ.84 కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని రైల్వే శాఖ తెలిపింది. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన, హింసాత్మక ఘటనల వల్ల నష్టపోయిన ప్రజలకు, రైల్వేకు నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. దీంతో తమకు జరిగిన నష్టాన్ని తెలియజేస్తూ రైల్వే శాఖ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పశ్చిమబెంగాల్‌లో డిసెంబర్‌ 13 నుంచి 15 వరకు జరిగిన హింసాత్మక ఘటనల వల్ల రూ.84 కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయని, ఇందులో అత్యధికంగా తూర్పు రైల్వే పరిధిలోని సియాల్దా డివిజన్‌లో రూ.46 కోట్లు, మాల్దా డివిజన్‌లో రూ.24.5 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది. ఆగ్నేయ రైల్వే పరిధిలో రూ.12.75 కోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.


logo