భూ కేటాయింపు పత్రాలను అందజేసిన ప్రధాని

శివసాగర్: అస్సాం రాష్ట్రంలో ఇవాళ ప్రధాని మోదీ స్థానిక తెగలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. శివసాగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్ష లబ్దిదారులకు భూపత్రాలను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ సభను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. అస్సాం శరవేగంగా అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమన్నారు. ఆత్మవిశ్వాసం ద్వారా ఆత్మనిర్బర్ అస్సాం సాధ్యమన్నారు. రాష్ట్రానికి చెందిన 40 శాతం మంది జనాభా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా లబ్ధిపొందుతునట్లు చెప్పారు. అస్సామీ సంస్కృతి రక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అస్సామీ భాష, సాహిత్య రక్షణకు అనేక విధానాలు అమలు చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజలకు నీటి సరఫరాను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్19ను అస్సాం రాష్ట్రం ఎదుర్కొన్న తీరు హర్షణీయమన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అస్సాం దూసుకువెళ్తున్నదని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఆయన అభ్యర్థించారు.