శనివారం 04 జూలై 2020
National - Jun 28, 2020 , 18:47:31

పీఎంకేర్స్‌ ఫండ్‌కు 'చైనా' విరాళాలు: అభిషేక్‌మనుసింఘ్వి

పీఎంకేర్స్‌ ఫండ్‌కు 'చైనా' విరాళాలు: అభిషేక్‌మనుసింఘ్వి

న్యూ ఢిల్లీ: గాల్వన్‌ ఘటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన పీఎంకేర్స్‌ ఫండ్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మనుసింఘ్వి పలు అనుమానాలు లేవనెత్తారు.  జాతీయ భద్రతకు ఆందోళన కలిగించే చైనా కంపెనీల నుంచి పీఎంకేర్స్ ఫండ్‌కు విరాళాలు వచ్చాయని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. 

‘జాతీయ భద్రతకు చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రధానమంత్రి మోడీ  చైనా కంపెనీల నుంచి భారీగా విరాళాలు అందుకున్నారు. ఈ పీఎంకేర్స్‌ ఫండ్‌ను ఎలా ఏర్పాటు చేశారు.. దాని కార్యాచరణ చట్రం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఇది ఎలా నియంత్రించబడుతుందో లేదా దానికి ఇచ్చిన డబ్బు ఎలా ఉపయోగించబడుతుందో కూడా ఎక్కడా పేర్కొనలేదు’ అని సింఘ్వి అన్నారు. కాగ్‌తోసహా ఏ ప్రజాధికార సంస్థ కూడా దీన్ని ఆడిట్‌ చేయలేదని ఆరోపించారు. ఈ ఫండ్‌ ప్రజాధికారం కాదని చెప్పే స్థాయికి పీఎంవో వెళ్లిందని, ఇది సమాచారహక్కు చట్టానికి కూడా లోబడి లేదని ఆయన పేర్కొన్నారు. పీఎంకేర్స్‌ ఫండ్‌ అనేది పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా రహస్య పద్ధతిలో ప్రధానమంత్రిచే నడుస్తున్నదని సింఘ్వి ఆరోపించారు. 

‘ఈ వివాదాస్పద ఫండ్‌లో మే 20 నాటికి పీఎం మోడీకి రూ. 9,678 కోట్లు వచ్చాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చైనా బలగాలు మన భూభాగంలోకి ప్రవేశించినప్పటికీ, ప్రధానమంత్రి చైనా కంపెనీల నుంచి డబ్బు అందుకున్నారు" అని  ఆయన వ్యాఖ్యానించారు.  గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్‌త్సో  సరస్సు ప్రాంతం, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ మైదానాల్లో వై-జంక్షన్ వరకు చైనా దళాలు మన భూభాగాన్ని ఆక్రమిస్తుంటే మోడీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని ఆరోపించారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా దేశాన్ని తప్పుదారి పట్టించారు. చైనా ఎప్పుడూ భారత భూభాగంలోకి చొరబడలేదని, ఏ భూభాగాన్ని ఆక్రమించుకోలేదని పేర్కొంటూ చైనీయుల చెడు ఎజెండాకు మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రయోజనాల కోసం ఈ ప్రశ్నలను అడుగుతూనే ఉంటుందని అన్నారు. చైనాపట్ల ప్రధాని మోడీ ఎప్పుడూ సానుకూల వైఖరితోనే ఉంటున్నారని, ఆయన చేసిన చైనా పర్యటనల ద్వారా ఇది అర్థమవుతోందన్నారు. ఐదుసార్లు చైనాను సందర్శించిన ఏకైక ప్రధాని మోడీ మాత్రమేనని సింఘ్వి ఎద్దేవా చేశారు. పీఎంకేర్స్‌ ఫండ్‌కు చైనా కంపెనీల నుంచి వందల కోట్ల విరాళాలను స్వీకరించిన భారత ప్రధాని ఇప్పుడు చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా ఎలా పోరాడగలుగుతారు?’ అని సింఘ్వి ప్రశ్నించారు. logo