సోమవారం 01 జూన్ 2020
National - May 12, 2020 , 20:31:07

రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన మోదీ

రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన మోదీ

న్యూఢిల్లీ : ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరుతో రూ. 20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. రేపట్నుంచి ఆత్మ నిర్భర్‌ అభియాన్‌పై ఆర్థిక మంత్రి వివరాలు అందిస్తారని తెలిపారు. కొవిడ్ -19 కోసం ప్రభుత్వం చేసిన ప్రకటనలతో పాటు, ఆర్బీఐ నిర్ణయాలు అన్నీ కలుపుకుని ఆ ప్యాకేజీ విలువ సుమారు రూ. 20 లక్షల కోట్లు ఉంటుందన్నారు. మన దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతమని మోదీ చెప్పారు. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రసంగించారు. ఈ నెల 17తో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  

భారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడి, రైతు జేబులోకి నేరుగా వెళ్తుందన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతం వస్తుందన్నారు. దేశంలోని ప్రతి పారిశ్రామికుడిని కలుపుకునిపోయేలా ప్యాకేజీ ఉంటుందని మోదీ పేర్కొన్నారు. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుందని మోదీ అన్నారు. 

సంఘటిత, అసంఘటిత రంగంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక ప్యాకేజీ కాపాడుతుందన్నారు. జన్ ధన్ అభియాన్ తో మనం ఒక విప్లవాన్ని చూశామన్నారు. ఇప్పుడు మరో కొత్త విప్లవానికి నాంది పలుకబోతున్నామని మోదీ చెప్పారు. భవిష్యత్ లో వ్యవసాయంపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏర్పాట్లు ఉంటాయన్నారు. స్థానిక మార్కెట్లను విస్తరించాల్సిన అవసరాన్ని ఈ సంకట స్థితి తెచ్చింది. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుందన్నారు. గ్లోబల్ డిమాండ్ తో పాటు, స్థానిక డిమాండ్ ను సృష్టించాలి అని మోదీ అన్నారు.


logo