ఆదివారం 17 జనవరి 2021
National - Dec 21, 2020 , 18:56:29

మోదీ, అమిత్‌ షా బాధ్యులంటూ.. రైతు ఆత్మహత్యాయత్నం

మోదీ, అమిత్‌ షా బాధ్యులంటూ.. రైతు ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బాధ్యులని ఆరోపిస్తూ ఒక రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. పంజాబ్‌లోని తరణ్‌ తరణ్‌కు చెందిన 65 ఏండ్ల రైతు నిరంజన్ సింగ్ సోమవారం హర్యానా, ఢిల్లీ సరిహద్దులోని సింగు సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ విషం సేవించి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఆ రైతును వెంటనే రోహ్తక్‌లోని పీజీఐఎంఎస్‌ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. 

అనంతరం రైతు నిరంజన్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు. సాధారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్యకు యత్నిస్తే దానికి కారణమైన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేస్తారని అన్నారు. తన ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై కేసు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. రైతులు లేకపోతే ఎవరైనా బతకగలరా అని ఆయన ప్రశ్నించారు. 

మరోవైపు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ శివారులో రైతులు చేస్తున్న నిరసనలో పాల్గొన్న కుల్బీర్ సింగ్ అనే రైతు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు తిరిగి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు 8 లక్షల అప్పులు ఉన్నాయని అధికారులు చెప్పారు.

కాగా, నిరసనలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 30 మంది రైతులు మరణించినట్లు తెలుస్తున్నది. చాలా మంది అనారోగ్య కారణాలతో చనిపోగా కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుని మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.