శనివారం 16 జనవరి 2021
National - Dec 23, 2020 , 08:04:24

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఏరియా కమాండర్‌ హతం

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఏరియా కమాండర్‌ హతం

రాంచీ: జార్ఖండ్‌లో నిన్న అర్థరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. రాంచీ జిల్లాలోని లోధ్‌మాలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు మంగళవారం సాయంత్రం మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఛేట్‌ గ్రామం సమీపంలో పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎల్‌ఎఫ్‌ఐ) ఏరియా కమాండర్‌ పునరై ఒరాన్‌ హతమవ్వగా, మిగిలిన సభ్యులు తప్పించుకున్నారు. వారికోసం ఆప్రాంతంలో గాలింపు చేపట్టామని రాంచీ ఎస్‌ఎస్‌పీ సురేంధర్‌ ఝా తెలిపారు. 

గతవారం ఖుంటీ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పీఎల్‌ఎప్‌ఐ అగ్రనేత జైడెన్‌ గుడియా హతమయ్యాడు. వారం వ్యవధిలోనే మరో అగ్రనేతను పీఎల్‌ఎఫ్‌ఐ కోల్పోయింది. రాంచీ, గుల్మా, ఖుంటీ జిల్లాల్లో పునరై ఒరాన్ సుపరిచితుడు. అతని తలపై రూ.2 లక్షల రివార్డు ఉన్నది. పోలీసులు అతనికోసం చాలాకాలం నుంచి గాలిస్తున్నారు. ఒక్క రాంచీ జిల్లాలోనే 14 కేసులు నమోదయ్యాయి. వ్యాపారస్తులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఒరాన్‌పై ఉన్నాయి.