శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 12:34:34

ద‌య‌చేసి న‌న్ను అహంకారిగా పేర్కొన‌వ‌ద్దు‌: నితీశ్‌కుమార్

ద‌య‌చేసి న‌న్ను అహంకారిగా పేర్కొన‌వ‌ద్దు‌: నితీశ్‌కుమార్

ప‌ట్నా: జేడీయూ అధినేత‌ నితీశ్‌కుమార్ ఏడోసారి బీహార్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించ‌బోతున్నారు. అయితే గ‌తంలోలా కాకుండా ఈసారి త‌న ప్రాభ‌వం పూర్తిగా త‌గ్గిన స్థితిలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌బోతున్నారు. ఎందుకంటే బీజేపీ మ‌ద్ద‌తులో నితీశ్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అవుతున్నా.. అత‌ని జేడీయూ పార్టీకి మాత్రం ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ నేప‌థ్యంలో 'మీ అహంకార‌మే ప్ర‌జ‌ల్లో మీప‌ట్ల అంస‌తృప్తిని పెంచింది క‌దా..!' అన్న మీడియా ప్ర‌శ్న‌కు నితీశ్ కుమార్ కాద‌ని స‌మాధాన‌మిచ్చారు.

'నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోవ‌డ‌మే మీ అస‌లైన బ‌లం. కానీ ఈ మ‌ధ్య మీరు ప్ర‌జ‌ల్లో క‌లిసిపోవ‌డం మానేశారు. అహంకారం పెరుగ‌డంవ‌ల్లే మీరు మునుప‌టిలా ఉండ‌క‌లేక‌పోతున్నార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అహంకారిగా మారార‌న్న ఆరోప‌ణ‌ల‌ను మీరు అంగీక‌రిస్తారా..? క‌రోనా సంక్షోభం కొన‌సాగిన‌న్నాళ్లు మీరు మౌనంగా ఉండ‌టానికి కార‌ణం ఏమిటి..? స‌ంక్షోభ స‌మ‌యంలో మీరు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్ట‌లేదు క‌దా..!' అని నితీశ్‌కుమార్‌ను మీడియా ప్ర‌శ్నించింది. 

పై ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ.. 'ద‌య‌చేసి న‌న్ను అహంకారి అని సంబోధించ‌కండి' అంటూ చేతులు జోడించారు. క‌రోనా స‌మ‌యంలో తాను మౌనంగా ఉండ‌టంవ‌ల్ల ప్ర‌జ‌లకు త‌న‌పై అసంతృప్తి పెరిగింద‌నడం కూడా క‌రెక్టు కాద‌ని నితీశ్ కొట్టిపారేశారు. ప్రెస్ మీట్‌లు పెట్ట‌క‌పోయినా క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం తాను అన్నివిధాలా కృషిచేశాన‌ని చెప్పారు. కాగా, తాజా ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి 125 స్థానాలు గెలిచి అధికారం ద‌క్కించుకున్నా అందులో నితీశ్ పార్టీ సాధించింది కేవ‌లం 43 సీట్లు మాత్ర‌మే. బీజేపీ 74 స్థానాల‌తో బీహార్‌లో ఆర్జేడీ త‌ర్వాత‌ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.