బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 13:58:00

పైల‌ట్ దీప‌క్ సాతే.. 27 సార్లు కోజికోడ్‌లో ల్యాండింగ్ చేశారు

పైల‌ట్ దీప‌క్ సాతే.. 27 సార్లు కోజికోడ్‌లో ల్యాండింగ్ చేశారు

హైద‌రాబాద్‌:  కేర‌ళ‌లోని కోజికోడ్ విమాన ప్ర‌మాదంలో పైల‌ట్ కెప్టెన్ దీపక్ సాతే ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ దీప‌క్ వైమానిక ద‌ళంలో పైల‌ట్‌గా ప‌నిచేశారు.  కోజికోడ్‌లో ఉన్న టేబుల్‌టాప్ ర‌న్‌వేపై ఆయ‌న‌కు ప‌ట్టు ఉన్న‌ది.  సుమారు 27 సార్లు ఆయ‌న కోజికోడ్ ర‌న్‌వేపై విమానాల‌ను ల్యాండ్ చేశారు.  ఈ ఏడాది కూడా దీప‌క్ విమానాల‌ను కోజికోడ్‌లో ల్యాండ్ చేసిన‌ట్లు కేంద్ర మంత్రి హ‌రిదీప్ తెలిపారు. కెప్టెన్ దీపక్ సాతే త‌ల్లి త‌న కుమారుడి గురించి కొన్ని విష‌యాలు చెప్పారు.  త‌న కుమారుడు దీప‌క్ చాలా మంచివాడ‌ని త‌ల్లి నీలా సాతే తెలిపారు. ఇత‌రుల‌కు సాయం చేయ‌డంలో అత‌ను ముందు ఉంటాడ‌ని ఆమె అన్నారు.  అత‌ని పాఠాలు చెప్పిన టీచ‌ర్లు ఇప్ప‌టికీ అత‌న్ని అభినందిస్తుంటార‌ని నీలా సాతే ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.  

కెప్టెన్ దీప‌క్ సాతే అంబాలాలో ఉన్న 17వ స్వ్కాడ్ర‌న్‌లో మిగ్‌21 యుద్ధ విమానాల‌ను కూడా న‌డిపారు.  58 ఏళ్ల దీప‌క్ దాదాపు 30 ఏళ్ల నుంచి పైల‌ట్‌గా ప‌నిచేస్తున్నారు. అయితే కోజికోడ్ ప్ర‌మాదంలో మ‌ర‌ణాల‌ను త‌గ్గేలా పైల‌ట్ దీప‌క్ చాలా ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. పుణెలోని ఎన్‌డీఏ అకాడ‌మీలో చ‌దివారు.  స్వార్డ్ ఆఫ్ హాన‌ర్ పుర‌స్కారాన్ని 1981లో అందుకున్నారు.  ఫైట‌ర్ పైల‌ట్‌గా వైమానిక ద‌ళంలో చేరారు.  దీప‌క్‌కు చెందిన స్క్వాడ్ర‌న్ ద‌ళం 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న‌ది. 1992లో స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌గా మారారు. 2003లో వింగ్ క‌మాండ‌ర్‌గా రిటైర్ అయ్యారు. హిందుస్తాన్ ఏరోనాటిక‌ల్ లిమిటెడ్ సంస్థ‌లో పైల‌ట్‌గా సేవ‌లు అందించారు. ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీలో కూడా శిక్ష‌కుడిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎయిర్ ఇండియాలో చేరారు. 

ముంబైలోని పొవాయిలో పైల‌ట్ కెప్టెన్ దీప‌క్ సాతే నివాసం ఉంటున్నారు.  18 ఏళ్లుగా ఆయ‌న ఎయిర్ ఇండియాలో పైల‌ట్‌గా చేస్తున్నారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఒక‌రు బెంగుళూరులో, ఒక‌రు అమెరికాలో సెటిల‌య్యారు.  స్క్వాష్ ప్లేయ‌ర్‌గా కూడా దీప‌క్‌కు గుర్తింపు ఉన్న‌ది.  దీప‌క్ చూపిన తెగువ‌, సాహాసాన్ని పైల‌ట్లు అభినందిస్తున్నారు. కోజికోడ్ ప్ర‌మాదంలోనే కోపైల‌ట్ అఖిలేశ్ కుమార్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అఖిలేశ్ మృదుస్వ‌భావి అని, అంద‌రితో మంచిగా ఉండేవార‌ని పైల‌ట్లు గుర్తు చేస్తున్నారు.  అశిలేశ్ భార్య మ‌రో 15 రోజుల్లో పురుడుపోసుకోనున్న‌ట్లు సోద‌రుడు బాసుదేవ్ తెలిపారు.  2017లో అత‌ను ఎయిర్ ఇండియాలో పైల‌ట్‌గా చేరారు.  


logo