న్యూఢిల్లీ: సమోసాలు అంటే ఇష్టపడని వారు ఉండరు. వీటి పేరు వింటేనే నోరూరుతుంది. అయితే సమోసాలకు ఆర్డర్ ఇచ్చిన నితిన్ మిశ్రా అనే ఒక వ్యక్తి వాటిపై క్రమ సంఖ్య ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఫొటోతో సహా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ‘నేను ఆర్డర్ చేసిన సమోసాలపై సీరియల్ నంబర్లు ఉన్నాయి. టెక్ ప్లీజ్.. నా హల్వాయికి దూరంగా ఉండవా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
మరోవైపు సమోసాలకు క్రమ సంఖ్య ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై పలు కామెంట్లు చేశారు. సమోసాలకు నంబర్ల విధానం కొనసాగడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, అవి ప్రముఖ ఈటరీ ‘సమోసా పార్టీ’కి చెందినవి అంటూ ఒకరు బదులిచ్చారు. ఆ ఈటరీ సమోసాలకు సీరియల్ నంబర్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.
సిబ్బంది తినకుండా ఉండేందుకే సమోసాలకు నంబర్లు వేసి ఉంటారని ఒకరు జోక్ వేశారు. త్వరలో బార్కోడ్, క్యూఆర్ కోడ్ వంటివి కూడా సమోసాలపై కనిపించవచ్చని మరొకరు చమత్కరించారు.