బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 16:41:09

నాలుగు నెలల్లోనే రూ.30వేల కోట్ల పీఎఫ్‌ విత్‌డ్రా

నాలుగు నెలల్లోనే రూ.30వేల కోట్ల పీఎఫ్‌ విత్‌డ్రా

న్యూ ఢిల్లీ : కరోనా సంక్షోభంతో పోరాడుతున్న సామాన్య ప్రజలకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కొండంత అండగా నిలబడింది. లాక్‌డౌన్‌, తరువాతి కాలంలో రూ.30వేల కోట్ల పీఎఫ్‌ను ఉపసంహరించుకున్నారు. కరోనా సంక్షోభం మధ్య లాక్‌డౌన్‌ కారణంగా కోట్ల మంది నిరుద్యోగులుగా మారి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ప్రజలు తమ పీఎఫ్‌లో కొంత భాగాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. 

లాక్‌డౌన్‌ తరువాత పీఎఫ్‌ ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక కోవిడ్‌ విండోను ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రకటించారు. బాధిత ప్రజలు ఈ సదుపాయాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. ఇదే కాకుండా వైద్య అవసరాల కోసం పీఎఫ్‌ను పొందే వ్యవస్థ కూడా ఉంది. కోవిడ్ కోసం ఈపీఎఫ్‌ఓ పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను చాలా సులభం చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత మూడు, నాలుగు రోజుల్లో డబ్బు ఖాతాలో జమ చేస్తారు.

80 లక్షల మంది డబ్బు విత్‌డ్రా చేసుకున్నారు

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఏప్రిల్ నుంచి జూలై వరకు సుమారు 80 లక్షల మంది చందాదారులు ఈపీఎఫ్‌ఓ నుంచి రూ .30,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈపీఎఫ్‌ఓ సుమారు 10 లక్షల కోట్ల నిధులను జమ చేస్తోంది. చందాదారుల సంఖ్య 6 కోట్లు. కరోనా సంక్షోభం మరింత కొనసాగితే సుమారు 1 కోటి మంది ప్రజలు పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ అంచనా వేస్తోంది. 

అయితే సాధారణ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ఫండ్‌ ఇంత తక్కువ సమయంలో విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి, కొంతమందికి జీతంలో కోతలు విధింపు కారణంగా ఇది కుదిరింది. ఖర్చులకు డబ్బు లేక పీఎఫ్‌కు విత్‌డ్రా చేసుకునే వారి సంఖ్య లక్షల్లో ఉందని ఈపీఎఫ్‌ఓ తెలియజేసింది. 

మూడు నెలల్లోనే రూ.30వేల కోట్లు 

కొవిడ్‌ విండో కింద 30 లక్షల మంది చందాదారులు రూ.8000 కోట్లను ఉపసంహరించుకున్నారని నివేదిక పేర్కొంది. 50 లక్షల మంది చందాదారులు సాధారణ అవసరాలకు, ప్రధానంగా వైద్య అవసరాలకు రూ.22000 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. 2019-20 ఆర్థిక ఏడాదిలో మొత్తం రూ.72 వేల కోట్లు విత్‌డ్రా అయినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం నాలుగు నెలల్లోనే 30 వేల కోట్లు ఉపసంహరించుకున్నారు.logo