శనివారం 30 మే 2020
National - Mar 27, 2020 , 01:02:44

మనసు మీదికి తీసుకోవద్దు!

మనసు మీదికి తీసుకోవద్దు!

-కరోనా భయంతో ఒత్తిడికి గురవుతున్న ప్రజలు 

-ఒంటరితనంతో కొందరిలో మానసిక కుంగుబాటు 

-ఆశావహ దృక్పథం అవసరం అంటున్న నిపుణులు 

-యోగా వంటి వ్యాపకాలకు మళ్లాలని సలహా 

న్యూఢిల్లీ: కాబోయే తల్లి కనే కలలు, పుట్టే బిడ్డ పట్ల ఆమెకుండే ఆరాటాన్ని మాటల్లో వర్ణించి చెప్పలేం. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వాసి రితిక (26) అనే గర్భిణీ ఇలాంటి కలలే కన్నది. పుట్టబోయే బిడ్డపై మమకారాన్ని పెంచుకున్నది. ఓ ప్రభుత్వోద్యోగినిగా పని చేస్తున్న రితిక.. ప్రసూతి సెలవులపై వారణాసిలోని తల్లి ఇంటిలో ఉంటున్నారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆమెను ఆందోళనకు గురి చేస్తున్నది. కరోనా భయాలు ఆమెను స్థిమితంగా ఉండనివ్వడంలేదు. ఎక్కడ వైరస్‌ తనకు సోకుతుందోనని. తన ద్వారా పుట్టబోయే తన బిడ్డకు కూడా వైరస్‌ సోకితే పరిస్థితి ఏంటన్న ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సమస్య ఒక్క రుతికదే కాదు.. గర్భిణీలతో పాటు వృద్ధులు, మహిళలు, పురుషులు, యువత కూడా కరోనా గురించి అందోళనలతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

‘లాక్‌డౌన్‌తో  ఇంటిలోనే ఉన్నప్పటికీ ఇంతకుముందులాగే నిద్ర మేల్కొనే సమయంలోనే నిద్ర లేవడం, స్నానం చేయడం, ఇంట్లో ఉన్నప్పుడు ధరించే  పైజామా, లుంగీ, టీషర్ట్‌ వంటివాటినే కాకుండా అప్పుడప్పుడు ఫార్మల్‌ దుస్తులు (ఆఫీసుకు, బయటకు వెళ్లేప్పుడు ధరించే దుస్తులు) వేసుకోవాలి.. తద్వారా ఇంటిలో బందీ అయిపోయామన్న భావన కలుగదు ’ అని  అశోకా సెంటర్‌ ఫర్‌ వెల్‌ బీయింగ్‌ డైరెక్టర్‌ అర్విందర్‌ సింగ్‌ తెలిపారు. కొంత టైం సోషల్‌మీడియాలో సన్నిహితులతో గడపాలని దీప్తి షా అనే మానసిక నిపుణురాలు సలహానిచ్చారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా చేయాలని, సంగీతాన్ని వినాలని సూచిస్తున్నారు.

సోకుతుందన్న భయం వద్దు

‘కరోనా భయాలతో నా దగ్గరకొ చ్చే కొంత మంది.. తమలో వైరస్‌ లక్షణాలు లేకున్నా, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు’ అని ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ దవాఖానలో మానసిక నిపుణుడు రాజీవ్‌ మెహతా చెప్పారు. ఇప్పటికీ చాలామందికి సామాజిక దూరం అం టే ఏమిటో తెలియటం లేదని ముంబైలోని లీలావతి దవాఖానలో పనిచేస్తున్న విహంగ్‌ వహియా అనే మరో మానసిక వైద్యుడు తెలిపారు. ఒంటరిగా ఉం డటం అలవాటులేని చాలామంది ఈ లాక్‌డౌన్‌ వేళ కుంగుబాటుకు ఎక్కువగా లోనవుతున్నారన్నారు. రోజురోజుకు కరో నా కేసులు పెరుగుతున్నాయని వార్తలతో.. తమకు కూడా వైరస్‌ సోకుతుందేమోనని మరికొందరు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ‘గ్లాసు సగం ఖాళీగా ఉన్నది అని కాకుండా గ్లాసు సగం నిండింది’ అనే కోణంలోనే ప్రతి ఒక్కరు జీవితాన్ని చూస్తూ.. ఆశావహ దృక్పథంతో ఉండాలని సూచించారు.


logo