మంగళవారం 07 జూలై 2020
National - Jun 03, 2020 , 20:57:15

గుజ‌రాత్ పేలుడుతో రెండు గ్రామాలు ఖాళీ

గుజ‌రాత్ పేలుడుతో రెండు గ్రామాలు ఖాళీ

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్ రాష్ట్రం భ‌రూచ్ జిల్లాలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో చోటుచేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌ధ్యాహ్నం జ‌రిగిన పేలుడుతో చెల‌రేగిన మంట‌లు సాయంత్రానికి అదుపులోకి వ‌చ్చాయ‌ని భ‌రూచ్ జిల్లా క‌లెక్ట‌ర్ మోడీయా తెలిపారు. మ‌ధ్యాహ్నం మంట‌లు చెల‌రేగిన వెంట‌నే కెమిక‌ల్ కంపెనీ స‌మీపంలోని రెండు గ్రామాల‌కు చెందిన 4800 మందిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు. మండే స్వ‌భావం ఎక్కువ‌గా ఉన్న కెమిక‌ల్స్‌ను కంపెనీలో నిలువ ఉంచ‌డం వ‌ల్లే పేలుడు జ‌రిగిన‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ల‌భించిన ఆధారాల‌ను బ‌ట్టి తెలుస్తున్న‌ద‌ని మోడియా పేర్కొన్నారు. 

గుజ‌రాత్ రాష్ట్రం భ‌రూచ్ జిల్లాలోగ‌ల‌ దహేజ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఎస్టేట్‌లోని ఓ కెమిక‌ల్ కంపెనీలో ఈ రోజు మ‌ధ్యాహ్నం భారీ పేలుడు సంభ‌వించింది. య‌శ‌స్వి ర‌సాయ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జ‌రిగిన ఈ భారీ పేలుడులో ఐదుగురు మృతిచెందారు. 57 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రులు ప్ర‌స్తుతం భ‌రూచ్ జిల్లా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 


logo