శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 02:16:45

ఇకనైనా లొసుగులు పూడ్చాలి

ఇకనైనా లొసుగులు పూడ్చాలి

-దోషులు చట్టంతో ఆటలాడకుండా చూడాలని సర్వత్రా డిమాండ్‌

న్యూఢిల్లీ/బెంగళూరు: చట్టాల్లోని లొసుగుల ఆధారంగా నిర్భయ దోషులు తమ ఉరిశిక్షను ఇన్ని రోజులపాటు జాప్యం చేసిన నేపథ్యంలో ఇకనైనా వాటికి ముగింపు పలుకాలన్న వాదన బలంగా వినిపిస్తున్నది. దీనిపై నిర్భయ తల్లిదండ్రులకుతోడుగా రాజకీయ నాయకులు, న్యాయ నిపుణులు, బాలీవుడ్‌ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు గొంతెత్తుతున్నారు. దోషులకు ఉరిశిక్ష అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ.. ఆలస్యంగానైనా తమ కూతురికి న్యాయం దక్కిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో దోషులు శిక్షను జాప్యం చేసేందుకు అవకాశమివ్వకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేయాలని కోరారు. నిర్భయ తండ్రి భద్రీనాథ్‌సింగ్‌ మాట్లాడుతూ.. చట్టాల్లోని లొసుగులపై తమ న్యాయవాదులతో కలిసి అధ్యయనం జరుపుతామని, వాటిని ప్రభుత్వానికి అందజేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. నిర్భయకు న్యాయం దక్కిన రోజు ఇదని చెప్పారు.ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసేలా చూడాల్సిన అవసరం ఉన్నదన్నారు. జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖా శర్మ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎన్‌ సంతోష్‌ హెగ్డే మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తుది తీర్పు అమల్లోకి రావడానికి ‘సుదీర్ఘ కాలం’ పట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు. దీని వల్ల అసలు న్యాయవ్యవస్థ పనిచేస్తున్నదా అనే అనుమానం ప్రజల్లో కలిగే వీలుందన్నారు. మహిళపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలను కఠినతరం చేయాలని బాలీవుడ్‌ ప్రముఖులు రిషీకపూర్‌, తాప్సీ పన్ను, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు డిమాండ్‌చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో వేగంగా శిక్షలు అమలుచేయాలని నటులు రవీనా టాండన్‌, ప్రీతీజింటా కోరారు. 


logo