గురువారం 16 జూలై 2020
National - Jun 18, 2020 , 17:03:05

నెమలి పాడె మోసి.. అంత్యక్రియలు

నెమలి పాడె మోసి.. అంత్యక్రియలు

జైపూర్‌: ప్రస్తుత కరోనా వైరస్‌ వ్యాప్తి చెంది చనిపోయినవారి అంత్యక్రియలు చేయడమే ఒక పెద్ద తంతుగా మారింది. కుటుంబసభ్యులు, రక్తసంబంధీకులు సైతం అంత్యక్రియలకు వెళ్లలేని పరిస్థితులు, చివరిచూపుకు నోచుకోలేని గడ్డు పరిస్థితులు నెలకొన్ని ఉన్నాయి. అలాంటిది కరెంట్ షాక్‌తో చనిపోయిన ఒక జాతీయ పక్షి నెమలికి అటవీ అధికారులు పాడె కట్టి అంతిమయాత్ర నిర్వ‌హించి సంప్రదాయం ప్రకారంగా అంత్యక్రియలు పూర్తిచేశారు.  ఈ ఘటన రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌లో బుధవారం జరిగింది.

భరత్‌పూర్‌ పట్టణంలోని 50 వ వార్డు మధుర్‌ గేట్‌ ప్రాంతంలో విద్యుత్‌  షాక్‌ కొట్టి  నెమలి చనిపోయిన  విషయాన్ని స్థానికులు అటవీ  అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ అధికారులు సంఘటనాస్థలానికి వచ్చి నెమలి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం చట్టం ప్రకారం దానికి అంత్యక్రియలు  నిర్వహించేందుకు చర్యలు తీసుకొన్నారు. సంప్రదాయబద్దంగా పాడె కట్టి.. స్థానికులు, ప్రభుత్వ అధికారులతో కలిసి అంతిమయాత్ర నిర్వహించారు. నెమలి అంతిమయాత్రలో అటవీ అధికారి, తాసిల్దార్‌తోపాటు 50వ వార్డు కౌన్సిలర్‌ రామేశ్వర్‌ సైనీ పాల్గొన్నారు. స్థానిక శ్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం నెమలికి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ పక్షిని ఘనంగా నివాళులర్పించారు. 

నెమలి మన జాతీయ పక్షి నెమలి. చనిపోయిన నెమలిని అలా వదిలివేయడానికి మనసొప్పక ఇలా లాంఛనంగా స్వయంగా పాడెను మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించామని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు.  


logo