శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 02:26:30

నిరసనలతోనే దేశానికి స్వాతంత్య్రం

నిరసనలతోనే దేశానికి స్వాతంత్య్రం
  • అహింసపై ఇప్పటికీ ప్రజల్లో విశ్వాసం ఉండడం మన అదృష్టం: బాంబే హైకోర్టు
  • చట్టబద్ధ పాలనంటే మెజార్టీ పాలన కాదని వ్యాఖ్య

ముంబై/న్యూఢిలీ : ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే వారిని దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా నిందించకూడదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్‌ బెంచ్‌ స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా మహారాష్ట్రలోని బీదర్‌ జిల్లాలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తనకు, ఇతరులకు అనుమతి ఇవ్వాలని ఇఫ్తెఖార్‌ షేక్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. నిరసన చేపట్టడానికి జిల్లా కలెక్టర్‌, పోలీసులు అనుమతి నిరాకరించడంతో షేక్‌ కోర్టును ఆశ్రయించారు. శాంతియుత నిరసనలు చేపట్టేందుకు ప్రజలకు హక్కు ఉన్నదని, ఒక చట్టాన్ని వ్యతిరేకించినంత మాత్రాన అలాంటి వారిని దేశ ద్రోహులుగా పరిగణించకూడదని న్యాయమూర్తులు టీవీ నలవాడే, ఎంజీ సేవికర్‌ పేర్కొన్నారు. ‘శాంతియుత నిరసనలతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. దేశ ప్రజలు ఇప్పటికీ ఆ మార్గాన్నే అనుసరిస్తున్నారు. ఇప్పటికీ దేశంలో చాలా మంది ప్రజలు అహింసపై విశ్వాసం కలిగి ఉండడం మన అదృష్టం. మనకు రాజ్యాంగం ‘రూల్‌ ఆఫ్‌ లా’(చట్టబద్ధ పాలనను) ప్రసాదించింది.. ‘రూల్‌ ఆఫ్‌ మెజారిటీ’ (మెజారిటీ పాలనను) కాదు. సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించాలనికొందరు భావించవచ్చు.దానిపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వారికి హక్కు ఉన్నది’ అని కోర్టు పేర్కొంది. 


logo