శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 02:15:45

ఆరు నెలల రేషన్‌ ఒకేసారి!

ఆరు నెలల రేషన్‌ ఒకేసారి!

  • ఆహారధాన్యాలకు లోటు రాకుండా..
  • కరోనా నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 18: కరోనా వైరస్‌ నియంత్రణకు పలు ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో పేదలకు ఆహారధాన్యాలకు లోటు రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా రేషన్‌ పొందే లబ్ధిదారులు తమ ఆరు నెలల కోటాను ఒకేసారి తీసుకోవచ్చని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం లబ్ధిదారులు గరిష్ఠంగా రెండు నెలలు అడ్వాన్స్‌గా ఆహార ధాన్యాలు తీసుకుంటున్నారని, దీన్ని ఆరు నెలలకు పెంచుతున్నామన్నారు. పంజాబ్‌ ఇప్పటికే ఆరు నెలల రేషన్‌ ఒకేసారి అందిస్తున్నదని చెప్పారు. ‘మన వద్ద గోదాముల్లో తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. పేదలకు ఆరు నెలల రేషన్‌ ఒకేసారి అందించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరాం’ అని పాశ్వాన్‌ తెలిపారు. కరోనా నేపథ్యంలో రేషన్‌ షాపుల వద్ద రద్దీ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే అడ్వైజరీని జారీ చేసిందని తెలిపారు. 

ధరలను పర్యవేక్షిస్తున్నాం

కరోనా వ్యాప్తి కారణంగా సబ్సులు, ఫ్లోర్‌ క్లీనర్లు, థర్మల్‌ స్కానర్లకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వాటి ధరలను నిశితంగా పరిశీలిస్తున్నదని పాశ్వాన్‌ తెలిపారు. వీటి ధరలు పెరిగిన పక్షంలో వీటినీ నిత్యావసరాల చట్టం పరిధిలోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇటీవలే మాస్క్‌లను, హ్యాండ్‌ శానిటైజర్లను ఈ చట్టం పరిధిలోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 


logo