గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 00:38:38

జీతాల్లో కోతలా?

జీతాల్లో కోతలా?

  • l కొవిడ్‌ వైద్యులకు పూర్తి  వేతనాలను సకాలంలో చెల్లించండి
  • l క్వారంటైన్‌ సమయానికి కూడా వేతనం
  • l కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు 

న్యూఢిల్లీ: కొవిడ్‌ రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్‌కేర్‌ వర్కర్ల  జీతాల్లో కొన్ని రాష్ర్టాలు కోత విధించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులు, సిబ్బందికి పూర్తి జీతాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని,  ఈ మేరకు రాష్ర్టాలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. వైద్యుల 14 రోజుల క్వారంటైన్‌ సమయాన్ని సెలవుగా పరిగణించవద్దని సూచించింది. ఈ కాలానికి కూడా జీతాలు చెల్లించాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, ఆర్‌ సుభాష్‌ రెడ్డి, ఎమ్మార్‌ షా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వైద్యుల జీతాల్లో కోత విధిస్తున్నారని, జీతాలు సకాలంలో చెల్లించడం లేదని ఆరుషి జైన్‌ అనే వైద్యురాలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. వైద్యులకు పూర్తి జీతాల చెల్లింపు అంశంపై తాము జూన్‌ 17న ఇచ్చిన మార్గదర్శకాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. జీతాల్లో కోత విధించవద్దన్న ఆదేశాలను దాదాపు అన్ని రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌, త్రిపురలో అమలు కాకపోవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాష్ర్టాలు మీ ఆదేశాలను అమలు చేయకపోతే చర్యలు తీసుకునే అధికారం మీకు ఉన్నది. ప్రకృతి విపత్తుల చట్టం మీకు ఆ అవకాశాన్ని కల్పించింది’ అని వ్యాఖ్యానించింది.


logo