e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 16, 2021
Home జాతీయం పిల్లల ప్రతిభకు పేటెంట్స్‌

పిల్లల ప్రతిభకు పేటెంట్స్‌

  • తెలంగాణ నుంచి ఐదుగురు విద్యార్థుల అర్హత
  • జాతీయ ‘ఇన్‌స్పైర్‌’లో సత్తాచాటడంతో అవకాశం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (నమస్తే తెలంగాణ): వారు సామాన్య విద్యార్థులే. కానీ వారిలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభ అసామాన్యమైనది. టీచర్ల ప్రోత్సాహంతో ఆ ప్రతిభకు మరింత పదును పెట్టుకున్నారు. సమాజం ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలకు తమ చిట్టిబుర్రలతో పరిష్కారాలు కనుగొన్నారు. తమ ఆలోచనలకు ఆవిష్కరణల రూపమిచ్చి వర్కింగ్‌ మోడల్స్‌ను రూపొందించారు. అవి జిల్లా, రాష్ట్రం దాటి జాతీయస్థాయిలో ఉత్తమమైనవిగా నిలిచాయి. ఇలా తెలంగాణ నుంచి 5 వర్కింగ్‌ మోడల్స్‌ జాతీయస్థాయిలో ఉత్తమమైనవిగా నిలిచాయి. ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన ఇన్‌స్పైర్‌ పోటీల్లో మెరిశాయి. ఈ 5 ప్రాజెక్టులకు పేటెంట్‌ హక్కులు కూడా లభించనున్నాయి. దీంతో వీటికి ఐఐటీలు, ఎన్‌ఐటీల ద్వారా తుదిరూపునిచ్చి స్టార్టప్స్‌గా మలచనున్నారు. పిల్లల ప్రతిభకు తగిన గుర్తింపు లభించనున్నది.

సీలింగ్‌ ఫ్యాన్‌ లిఫ్టింగ్‌ టూల్‌
సీలింగ్‌ ఫ్యాన్లు బిగించడమంటే ఓ ప్రహసనం. ఎత్తైన టేబుళ్లు, కుర్చీలు, ఓ ముగ్గురు మనుషులు లేనిదే కుదరదు. ప్రతి ఇంట్లో ఎదురయ్యే ఈ తిప్పలకు స్వస్తి పలుకుతూ ‘సీలింగ్‌ ఫ్యాన్‌ లిఫ్టింగ్‌ టూల్‌’కు రూపకల్పన చేశాడు వికారాబాద్‌ జిల్లా గోకఫసల్‌వాడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి విద్యార్థి దాసరి అశోక్‌. ఈ ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో మూడో బహుమతి లభించింది. గైడ్‌ టీచర్‌ సనత్‌కుమార్‌ అందించిన సహకారంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు. చిన్నపాటి ఇనుప స్టాండ్‌కు హ్యాండిల్‌, చైన్‌కిట్‌, లిఫ్టింగ్‌ వీల్‌, జాక్‌ని బిగించాడు. జాక్‌ను తిప్పితే టూల్‌ మీద ఉన్న ఫ్యాన్‌ పైకి వెళ్తుంది. స్టాండ్‌ను నిచ్చెనలా వాడుకోవచ్చు. దీనిని ఫ్యాన్‌ బిగించడానికే కాకుండా గోడలకు సిమెంట్‌, రంగులు వేయడం వంటి పనులకు సైతం వాడుకోవచ్చని అశోక్‌ చెప్తున్నాడు. మధ్యలో ఉండే జాక్‌ను తీసేస్తే సాధారణ స్టాండ్‌గా మార్చుకోవచ్చని అశోక్‌ అంటున్నాడు.

- Advertisement -

ఫీడింగ్‌ చాంబర్‌
చంటి పిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చేందుకు తల్లులు సంకోచిస్తారు. చుడీదార్‌, పంజాబీడ్రెస్‌లు వేసుకున్న తల్లులు పాలిచ్చేందుకు పడే ఇబ్బంది అంతా ఇంతాకాదు. పిల్లలు ఏడ్వటాన్ని చూడలేక, పరిస్థితులు అనుకూలించక అవస్థలు పడుతుంటారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా గొడుగునే ఫీడింగ్‌ చాంబర్‌గా మలిచాడు మంచిర్యాల జిల్లా కాసిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జుమ్మిడి అంజన్న. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేందుకు తల్లులు పడుతున్న ఇబ్బందిని, కొంతమందికి డబ్బాపాలు పట్టడాన్ని గమనించిన అంజన్న.. గొడుగుకు వస్త్రాన్ని కుట్టించి, గొడుగును తెరిస్తే గదిలా మారే ఫీడింగ్‌ చాంబర్‌ను రూపొందించాడు. ఈ ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో నాలుగో బహుమతి లభించింది. హ్యాండ్‌బాగ్‌లో పట్టే ఈ ఫీడింగ్‌ చాంబర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని, గైడ్‌ టీచర్‌ వేములవాడ రమేశ్‌ సహకారంతోనే ఇది తయారుచేసినట్టు అంజన్న చెప్తున్నాడు.

పింక్‌ లూ
మూత్రశాలల్లో ఆడవాళ్లు సైతం నిలబడి మూత్రంపోసే పింక్‌ లూ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం కన్సాన్‌పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి భూమిక తయారుచేసింది. గర్భిణులు, వృద్ధులు, మోకాళ్లనొప్పులు ఉన్నవారు నిలబడి మూత్రంపోసే అత్యాధునిక టాయ్‌లెట్‌ను భూమిక తయారుచేసింది. గైడ్‌ టీచర్‌ సిద్ధేశ్‌ సహకారంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన భూమిక.. దీనిద్వారా దుర్వాసనలు, ఇన్‌ఫెక్షన్లను అరికట్టవచ్చని చెప్తున్నది.

పెడల్‌ పవర్డ్‌ మల్టీపర్పస్‌ మెషిన్‌
కరెంట్‌ పోతే చాలు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటాం. గృహోపకరణాలన్నీ కరెంట్‌ ఆధారంగానే పనిచేస్తాయి. అందుకే బిల్లులు తడిసిమోపెడవుతాయి. కరెంట్‌తో పనిలేకుండా సైకిల్‌ తొక్కినప్పుడు గ్రైండర్‌, వాషింగ్‌ మెషిన్‌, సెల్‌ఫోన్‌ చార్జింగ్‌, రంపం పనిచేయడం వంటి ఉపయోగాలు గల పెడల్‌ పవర్డ్‌ మల్టీపర్పస్‌ మెషిన్‌కు రూపకల్పన చేసింది కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి (హవేలి)లోని ఆల్పోర్స్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి వేముల శ్రీహితరెడ్డి. గైడ్‌ టీచర్‌ రిషికేశ్‌ సహకారంతో కరెంట్‌తో పనిలేకుండా ఇంట్లోనే సైక్లింగ్‌ ద్వారా పైవన్నీ పనిచేసే ప్రాజెక్టు తయారుచేసింది. దీనిని వర్కవుట్స్‌, ఫిట్‌నెస్‌ కోసం సైతం వినియోగించుకోవచ్చని శ్రీహిత చెప్తున్నది.

చిల్లీ బ్యాగ్‌ ఫిల్లింగ్‌
ఎండుమిర్చిని పండించడం ఒక ఎత్తైతే.. దానిని గోదాముల్లో భద్రపరచడం, మార్కెట్‌కు తరలించి విక్రయించడం మరో ఎత్తు. మండుటెండల్లో ఎర్రటి మిరపకాయలను సంచుల్లో నింపేందుకు రైతులు అవస్థలు పడుతుంటారు. సంచుల్లోకి దిగి తొక్కుతుంటారు. రైతులు, కూలీలకు కాళ్లుమండి ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. దీనికి పరిష్కారంగా చిల్లీ బ్యాగ్‌ ఫిల్లింగ్‌ ప్రాజెక్టును ఖమ్మం జిల్లా తల్లాడ బాలభారతి విద్యాలయ విద్యార్థి ఉదయ్‌కిరణ్‌ తల్లూరి రూపొందించాడు. గైడ్‌ టీచర్‌ ప్రవీణ్‌ సహకారంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయగా.. ఇది జాతీయస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana