మంగళవారం 07 జూలై 2020
National - Jun 14, 2020 , 20:28:18

కరోనాకు మందు కనిపెట్టేశామోచ్‌!

కరోనాకు మందు కనిపెట్టేశామోచ్‌!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గత నాలుగైదు నెలలుగా ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఎన్నో దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో పలు దేశాల శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ మహమ్మారి ముప్పు తప్పదని నిపుణులు తేల్చారు. దీంతో సమస్త మానవాళి వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని, ఫేస్ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే, ఆ మహమ్మారిని అంతం చేసే ఆయుర్వేద మందును కనిపెట్టేశామంటున్నారు పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ సహా వ్యవస్థాపకుడు, సీఈవో ఆచార్య బాలకృష్ణ.

ఈ పరిస్థితుల్లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. కరోనాను ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చునని, ఈ దిశగా ఫలితాలు రాబట్టేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని నియమించామని, క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. వందలాది మంది కరోనా పాజిటివ్ పేషంట్లకు క్లినికల్ ట్రయల్స్‌లో తమ మందుతో చికిత్స అందించి 100 శాతం సానుకూల ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. తాము తయారుచేసే ఆయుర్వేద మందు వాడితే 5-14 రోజుల్లో కరోనా పాజిటివ్‌ కాస్తా నెగిటివ్‌గా మారుతుందని బాలకృష్ణ వెల్లడించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన ఆధారాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కేవలం ఆయుర్వేద వైద్యంతోనే కొవిడ్‌-19 నివారణ సాధ్యమని ఆయన చెప్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కొవిడ్‌-19 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నవాటిలో ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌, బయోటెక్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మెర్క్‌, మోడెర్నా, సనోఫీతోపాటు చైనాకు చెందిన కాన్సినో బయోలాజికల్స్‌ సంస్థలు ఉన్నాయి.


logo