మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 17:48:11

క‌రోనాపై పార్ల‌మెంట‌రీ ప్యానెల్ రిపోర్ట్‌

క‌రోనాపై పార్ల‌మెంట‌రీ ప్యానెల్ రిపోర్ట్‌

న్యూఢిల్లీ: ప‌్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా బెడ్స్ లేవు.. క‌రోనా చికిత్స‌పై స‌రైన మార్గ‌ద‌ర్శ‌కాలు లేవు.. దీంతో ప్రైవేటు ఆసుప‌త్రులు పేషెంట్ల నుంచి భారీగా ఫీజులు వ‌సూలు చేశాయి అని పార్ల‌మెంట‌రీ ప్యానెల్ ఒక‌టి శ‌నివారం స్ప‌ష్టం చేసింది. ఆరోగ్యంపై పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్ రామ్ గోపాల్ యాద‌వ్ ఈ మేర‌కు రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడుకు నివేదిక స‌మ‌ర్పించారు. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌పై ఒక పార్ల‌మెంట‌రీ కమిటీ ఇచ్చిన తొలి నివేదిక ఇది. 130 కోట్ల‌కుపైగా జ‌నాభా ఉన్న ఈ దేశంలో ఆరోగ్య ర‌క్ష‌ణ‌కు కేటాయిస్తున్న నామ‌మాత్ర‌పు నిధుల అంశాన్ని కూడా ఈ క‌మిటీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది. క‌రోనా మ‌హ‌మ్మారిని దీటుగా ఎదుర్కోక‌పోవ‌డానికి ఇది కూడా ఒక కార‌ణ‌మ‌ని క‌మిటీ తేల్చి చెప్పింది. 

ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు నిధుల‌ను భారీగా పెంచాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని, ఇది జీడీపీలో 2.5 శాతంగా ఉండాల‌ని సిఫార‌సు చేసింది. అది కూడా వ‌చ్చే రెండేళ్ల‌లోనే జ‌ర‌గాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది. నిజానికి ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం జీడీపీలో 1.15 శాతం మేర మాత్ర‌మే నిధులు కేటాయిస్తున్నారు. దీనిని 2025లోగా 2.5 శాతానికి పెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇది చాలా ఆల‌స్యం అవుతుందని, రెండేళ్ల‌లోపే ఈ ల‌క్ష్యాన్ని అందుకోవాల‌ని క‌మిటీ తేల్చి చెప్పింది. క‌రోనా, క‌రోనాయేత‌ర పేషెంట్ల కోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా బెడ్స్ లేవ‌ని ఈ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌త్యేకంగా కొవిడ్ చికిత్స మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా లేక‌పోవ‌డంతో చికిత్స ఖ‌ర్చు త‌డిసి మోపెడైంద‌ని ఈ క‌మిటీ వెల్ల‌డించింది.