మంగళవారం 07 జూలై 2020
National - Jul 05, 2020 , 02:45:34

నువ్వు లేక.. మేము లేము

నువ్వు లేక.. మేము లేము

  • ఒడిశాలో కరోనాతో కొడుకు మరణం
  • తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య

న్యూఢిల్లీ/బేగంపేట: ఒక్కగానొక్క కొడుకు.అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇంతలోనే ఆ యువకుడిని కరోనా బలితీసుకున్నది. కుమారుడి మరణం తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.  కరోనా కుటుంబాలకు కుటుంబాలనే బలితీసుకుంటున్నదనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. రాజ్‌కిశోర్‌, సులోచన దంపతుల ఒకే ఒక్క కుమారుడికి(27) ఇటీవల కరోనా సోకింది. బుధవారం అతనికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడంతో దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. దీంతో మనోవేదన చెందిన తల్లిదండ్రులు కుమారుడు చనిపోయిన కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.ఒడిశాలోనే జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన నిర్లిప్త భోలా, సుభద్ర స్వైన్‌లకు ఏడాదిన్నర కిందనే పెండ్లి అయింది. బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చారు. జూన్‌ 30న స్వస్థలానికి వెళ్లారు. ఈ నెల 1న భోలాకు జ్వరం రావడంతో క్వారంటైన్‌ నుంచి ఐసొలేషన్‌కు తరలించారు. అతడు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక సుభద్ర ఐసొలేషన్‌ కేంద్రంలోనే చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అయితే కరోనా పరీక్ష ఫలితాల్లో ఇద్దరికీ కరోనా నెగెటివ్‌ వచ్చింది. కాగా, పశ్చిమ బెంగాల్‌ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన పల్ట్‌పాన్‌(34)కరోనా సోకిందేమోనన్న భయంతో హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.



logo