గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 14:21:48

పాన్‌కార్డ్‌తో ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపు

పాన్‌కార్డ్‌తో ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకునే గడువును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) మరోమారు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువును పెంచుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత మార్చి 31తో ముగిసిన గడువును జూన్‌ 30కి పొడిగించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 32.17 కోట్ల పాన్‌ కార్డులకు ఆధార్‌ నంబర్లు లింక్‌ అయ్యాయి. గతంలో పేర్కొన్న విధంగా జూలై 1 నుంచి ఆర్థిక లావాదేవీలు చేయాలంటే పాన్‌ కార్డుకు ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా లింకై ఉండాలని సీబీడీటీ పేర్కొంది. 

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 272బీ ప్రకారం పాన్‌, ఆధార్‌ నంబర్లను అనుసంధానం చేయకపోతే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కార్డులను లింక్‌ చేయనట్లయితే పాన్‌ కార్డు రద్దవుతుంది. ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేస్తేనే తిరిగి అది పనిచేస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 139ఏఏలోని సబ్‌సెక్షన్‌ 2 ప్రకారం ఆధార్‌, పాన్‌ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. కాగా, ఆధార్‌, పాన్‌ లింక్‌ గడువును సీబీడీటీ పొడిగించడం ఇది తొమ్మిదోసారి.


logo