శనివారం 06 జూన్ 2020
National - May 14, 2020 , 17:27:54

పాల్ఘర్ ఘటన: ఎస్పీని వెనుకకు రప్పించాలని ఆన్‌లైన్ వినతులు

పాల్ఘర్ ఘటన: ఎస్పీని వెనుకకు రప్పించాలని ఆన్‌లైన్ వినతులు

ముంబై: పాల్ఘర్‌లో ఇటీవల మూకుమ్మడి దాడిలో ఇద్దరు సాధువులు మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ గౌరవ్‌సింగ్‌ను తప్పనిసరి సెలవుపై పంపడాన్ని వెనుకకు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞాపనలు అందుతున్నాయి. ఎస్పీ సెలవుపై వెళ్లాలని ఆదేశిస్తూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ ఉత్తర్వులు జారీచేశారు. అయితే సింగ్‌ను తిరిగి పాల్ఘర్ కు రప్పించాలని కోరుతూ జిమ్ నడిపే సుజిత్‌సింగ్, సామాజిక కార్యకర్త కరణ్ చౌదరి ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులకు ఆ పిటిషన్‌ను ఉద్దేశించారు. change.orgలో పెట్టిన ఆ పిటిషన్ కు ఇప్పటివరకు 350 సంతకాలు వచ్చాయి. నిజానికి జిల్లా పరిస్థితి మెరుగుపర్చేందుకు ఎస్పీ గౌరవ్‌సింగ్ ఎంతో చేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు, గుట్కా, సారా మాఫియాలను ఏరేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆయన హయాంలో ప్రజలతో పోలీసుల సంబంధాలు మెరుగుపడ్డాయని వివిరంచారు. తాము ఆయన దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలు అన్నిటిని ఆయన పరిష్కరించారని పిటిషన్ పై సంతకం చేసిన ఆసిఫ్ ధనానీ అనే న్యాయవాది చెప్పారు. ఆ ఎస్పీ మాకు కొండంత అండ అని పాల్ఘర్‌కు చెందిన డాక్టర్ హితేశ్ చూరీ అన్నారు. మే 8న ఆయనను బలవంతపు సెలవుపై పంపారు.


logo