గురువారం 22 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 13:10:12

అన్నాడీఎంకే సీఎం అభ్య‌ర్థిగా ప‌ళ‌నిస్వామి!

అన్నాడీఎంకే సీఎం అభ్య‌ర్థిగా ప‌ళ‌నిస్వామి!

చెన్నై: త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే త‌ర‌ఫున మ‌ళ్లీ ప‌ళ‌నిస్వామినే సీఎం అభ్య‌ర్థిగా ఎన్నుకునే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప‌ళ‌నిస్వామి నేతృత్వంలోనే త‌మ పార్టీ 2021 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సోమ‌వారం జ‌రిగిన పార్టీ కార్య‌వ‌ర్గ సమావేశంలో సీఎం అభ్య‌ర్థిత్వం విష‌య‌మై దాదాపు 5 గంట‌ల‌పాటు చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం ఇద్ద‌రూ సీఎం అభ్య‌ర్థిత్వం కోసం ప‌ట్టుబ‌ట్టారు. ఈ సంద‌ర్భంగా కార్య‌వ‌ర్గం రెండు గ్రూపులుగా విడిపోయి పోటాపోటీ నినాదాలు కూడా చేసుకున్నారు.

అయితే, పార్టీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో గొడ‌వ జ‌రిగ‌న‌ప్ప‌టికీ సీఎం అభ్య‌ర్థిత్వం మాత్ర‌మే ప‌ళ‌నిస్వామికే ద‌క్క‌బోతున్న‌ద‌ని అన్నాడీఎంకేలోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులైన ఎస్ సెమ్మ‌లై, పీ తంగ‌మ‌ణి, సీవీ ష‌ణ్ముగం, ఆర్ విశ్వ‌నాథ‌న్ ప‌ళ‌నిస్వామివైపే మొగ్గు చూపుతున్నారు. ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న ప‌ళ‌నిస్వామిని కాద‌ని ప‌న్నీర్ సెల్వంకు సీఎం అభ్య‌ర్థిత్వం క‌ట్ట‌బెడితే ప్ర‌తిప‌క్షాలు అప‌హాస్యం చేస్తూ ప్ర‌చారంలో ఆయుధంగా వాడుకునే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో ప‌న్నీర్ సెల్వం కూడా పార్టీలోని సీనియ‌ర్‌ల మాట వినే అవ‌కాశం ఉంది. అందుకే ఈ వారం రోజుల్లో చ‌ర్చ‌ల ద్వారా అన్ని అంత‌ర్గ‌త‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటామ‌ని,‌ అక్టోబ‌ర్ 7న సీఎం అభ్య‌ర్థి పేరును అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేట‌ర్ కేపీ మునుస్వామి తెలిపారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo