సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 17:31:50

మూడో సెక్టార్‌లో పాకిస్థాన్ బ‌రితెగింపు.. వీడియోలు

మూడో సెక్టార్‌లో పాకిస్థాన్ బ‌రితెగింపు.. వీడియోలు

శ్రీన‌గ‌ర్‌: భార‌త సేన‌ల చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బ తిన్నా పాకిస్థాన్ సైన్యానికి బుద్ధి రావ‌డంలేదు. జ‌మ్ముక‌శ్మీర్‌లోకి ఉగ్ర‌వాదుల‌ను చొర‌బెట్ట‌డం కోసం త‌ర‌చూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్న‌ది. తాజాగా శుక్ర‌వారం ఉద‌యం నుంచి నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి జ‌మ్ముక‌శ్మీర్‌లోని మూడు సెక్టార్‌ల‌లో పాకిస్థాన్‌ కాల్పుల‌కు తెగ‌బ‌డింది. ఉద‌యం బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్‌లోని ఇజ్‌మార్గ్‌లో కాల్పుల‌కు పాల్ప‌డింది.

ఆ త‌ర్వాత కొన్ని నిమిషాల‌కే కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్‌లో పాకిస్థాన్ సేన‌లు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. మ‌ధ్యాహ్నం బారాముల్లా జిల్లాలోని యూరి సెక్టార్‌లో భార‌త సైనిక స్థావ‌రాలే ల‌క్ష్యంగా పాక్ కాల్పుల‌కు పాల్ప‌డింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోహ‌ల్‌ స‌హా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక కానిస్టేబుల్‌, న‌లుగురు పౌరులు కూడా ఉన్నారు. 

అంతేగాక‌, ఈ కాల్పుల్లో మ‌రికొంద‌రు జ‌వాన్‌లు, పౌరులు గాయ‌ప‌డ్డారు. వారిని అధికారులు వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పాకిస్థాన్ దాడిని భార‌త్ స‌మ‌ర్థంగా ఢీకొట్టింది. ప‌లుచోట్ల పాకిస్థాన్ బంక‌ర్ల‌ను ధ్వంసం చేసింది. భార‌త సైన్యం ఎదురు దాడిలో సుమారుగా 7 నుంచి 8 మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెంది ఉంటారని, మ‌రో 10 నుంచి 12 మంది సైనికులు గాయ‌ప‌డి ఉంటార‌ని ఇండియ‌న్ ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పాకిస్థాన్ కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న‌, భార‌త్ ఎదురుదాడికి సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోల్లో చూడ‌వ‌చ్చు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.