శనివారం 23 జనవరి 2021
National - Nov 29, 2020 , 14:47:09

ఎల్‌ఓసీ వెంట పాక్‌ రేంజర్ల కాల్పులు.. తిప్పికొట్టిన సైన్యం

ఎల్‌ఓసీ వెంట పాక్‌ రేంజర్ల కాల్పులు.. తిప్పికొట్టిన సైన్యం

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలపై పాక్‌ రేంజర్స్‌ శనివారం రాత్రి నుంచి కాల్పులు జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించారని అధికారులు ఆదివారం తెలిపారు. హీరానగర్‌ సెక్టార్‌లోని మన్యారి, కరోల్‌ కృష్ణలోని సరిహద్దు దాటి శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయని, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్‌) సమర్థవంతంగా తిప్పి కొట్టిందని పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జాము వరకు సరిహద్దుల వెంట నాలుగు సార్లు కాల్పులు జరిగాయని అధికారులు చెప్పారు. అయితా కాల్పులతో దేశ సైన్యానికి ఎలాంటి ప్రమాదం జరుగలేదని వివరించారు. కాగా, గత ఎనిమిది నెలలుగా పాకిస్థాన్‌ సైన్యం తరుచూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండడంతో సరిహద్దులోని గ్రామాల ప్రజల జీవితాలు దయనీయంగా మారాయి.

జీవితం చాలా కష్టంగా మారిందని, ప్రతి రాత్రి పాక్‌ కాల్పుల నుంచి రక్షణ పొందేందుకు భూగర్భంలోని బంకర్లలో తలదాచుకోవాల్సి వస్తుందని మన్యారీ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో పాక్‌ మోర్టార్ల దాడుల్లో గ్రామంలో దాదాపు డజను ఇండ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ మా జీవితాలను దుర్భరంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శనివారం జమ్మూ జిల్లాలోని అర్నియా సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్‌ భూభాగంలోకి ప్రవేశించిన పాక్‌కు చెందిన డ్రోన్‌ రాగా.. బీఎస్‌ఎఫ్‌ కాల్పులు జరుపడంతో తిరిగి వెళ్లిందని అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా పాక్‌ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తోంది. దీంతో భద్రతా దళాలు సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసింది.


logo