బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 10:35:52

అభినంద‌న్‌ను వ‌దిలేయండి.. వ‌ణికిన పాక్ ఆర్మీ చీఫ్‌

అభినంద‌న్‌ను వ‌దిలేయండి.. వ‌ణికిన పాక్ ఆర్మీ చీఫ్‌

హైద‌రాబాద్‌: గ‌త ఏడాది పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌ర్వాత‌.. పాకిస్థాన్‌పై భార‌త వైమానిక ద‌ళం దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ దాడిలో వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ పాకిస్థాన్ ఆర్మీకి చిక్కాడు. అయితే ఇమ్రాన్ ఖాన్  ప్ర‌భుత్వం గ‌త ఏడాది మార్చి ఒక‌టో తేదీన పైల‌ట్‌ అభినంద‌న్‌ను విడిచి పెట్టింది. వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ను విడిచిపెట్టేందుకు దారితీసిన ప‌రిణామాల‌పై పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్‌-ఎన్‌) నేత అయాజ్ సాదిక్ ఆ దేశ జాతీయ అసెంబ్లీలో కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు.  అభినంద‌న్‌ను పాక్ అరెస్టు చేసిన త‌ర్వాత ఆ దేశ ఆర్మీ చీఫ్ ఖ‌మ‌ర్ జావెద్ బాజ్వా గ‌జ‌గ‌జ వ‌ణికిపోయిన‌ట్లు చెప్పారు. అభినంద‌న్ అరెస్టు అయిన రోజున విదేశాంగ మంత్రి షా మెహ‌బూద్ ఖురేషి ఓ మీటింగ్ ఏర్పాటు చేశార‌ని, ఆ స‌మావేశానికి పార్ల‌మెంట‌రీ నేత‌ల‌తో పాటు ఆర్మీ చీఫ్ కూడా వ‌చ్చార‌ని,  ఒక‌వేళ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్‌ను రిలీజ్ చేయ‌కుంటే, ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు భార‌త్ త‌మ‌పై దాడి చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ఖురేషి చెప్పిన అంశాల‌ను అయాజ్ సాధిక్ గుర్తు చేశారు.  

విదేశాంగ మంత్రి ఖురేషి మాట‌లు విన్న ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లు గ‌జ‌గ‌జ వ‌ణికిపోయాయాని, ఆయ‌న‌కు చ‌మ‌ట‌లు ప‌ట్టేశాయ‌ని సాధిక్ త‌న ప్ర‌సంగంలో గుర్తు చేశారు.  అభినంద‌న్‌ను విడిచిపెట్టాల‌ని విదేశాంగ మంత్రి ఖురేషి ఆర్మీని కోరిన‌ట్లు సాధిక్ తెలిపారు. ఖురేషి నేతృత్వంలో జ‌రిగిన ఆ మీటింగ్‌లో ప్ర‌ధాని ఇమ్రాన్ పాల్గొన‌లేదు. రాత్రి 9 గంట‌ల‌కు భార‌త్ దాడి చేయ‌నున్న‌ద‌ని, దేవుడిపై ద‌య ఉంచి అభినంద‌న్‌ను రిలీజ్ చేయండి అంటూ ఖురేషి అన్న‌ట్లు సాధిక్ తెలిపారు.  వింగ్ క‌మాండ‌ర్‌ను వ‌దిలేందుకు విప‌క్షాలు కూడా స‌హ‌క‌రించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  పుల్వామా దాడి అనంత‌రం జ‌రిగిన యుద్ధ విమానాల డాగ్ ఫైట్‌లో.. పాక్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని అభినంద‌న్ నేల‌కూల్చాడు. ఆ త‌ర్వాత అత‌ను పాక్ ఆర్మీ ద‌ళాల‌కు చిక్కాడు.  పైల‌ట్‌ అభినంద‌న్‌కు వీర చ‌క్ర అవార్డు ఇచ్చి భార‌త ప్ర‌భుత్వం అత‌న్ని స‌త్క‌రించింది.