గురువారం 04 జూన్ 2020
National - Jan 26, 2020 , 03:13:07

ప్రతిభావంతులకు ‘పద్మా’లంకారం

ప్రతిభావంతులకు ‘పద్మా’లంకారం
  • ఏడుగురికి పద్మవిభూషణ్‌, 16 మందికి పద్మభూషణ్‌, 118 మందికి పద్మశ్రీ
  • పీవీ సింధుకు పద్మభూషణ్‌, వెంకట్‌రెడ్డి, విజయసారథికి పద్మశ్రీ
  • జార్జ్‌ ఫెర్నాండెజ్‌, సుష్మ, జైట్లీలకు పద్మ విభూషణ్‌

న్యూఢిల్లీ, జనవరి 25: దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా భావించే ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 141 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేస్తూ 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ వివరాలను వెల్లడించింది. ఏడుగురిని పద్మవిభూషణ్‌, 16 మందిని పద్మభూషణ్‌, 118 మందిని పద్మశ్రీ వరించింది. ఈమేరకు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికైన వారిలో పీవీ సింధు సహా ముగ్గురు తెలంగాణవాసులు ఉన్నారు. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారంగా పేర్కొనే పద్మవిభూషణ్‌ అవార్డుకు ప్రభుత్వం కేంద్ర మాజీ మంత్రులు జార్జ్‌ ఫెర్నాండెజ్‌, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, విశ్వేశతీర్థ స్వామీజీని మరణానంతరం ఎంపిక చేసింది.. వీరితోపాటు ఒలింపిక్‌ పతక విజేత, ప్రముఖ బాక్సర్‌ మేరీ కోమ్‌, మారిషస్‌ మాజీ ప్రధాని అనిరుధ్‌ జగన్నాథ్‌, చన్నూలాల్‌ మిశ్రా కూడా పద్మవిభూషణ్‌ను దక్కించుకున్నారు. అసాధారణమైన, విశిష్ట సేవలందించిన వారికి పద్మవిభూషణ్‌, విశిష్ట సేవలందించినవారికి పద్మభూషణ్‌ అవార్డులందజేస్తారు. తెలుగుతేజం పీవీ సింధు, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సహా మరో 14 మంది పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకోనున్నారు. 


ఆయా రంగాల్లో అత్యున్నత సేవలందించిన వారికి అందజేసే పద్మశ్రీ అవార్డుకు తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సేవలందించినందుకుగాను తెలంగాణకు చెందిన చింతల వెంకట్‌రెడ్డి, విద్యా, సాహిత్య రంగ ంలో అత్యుత్తమ సేవలందించినందుకు డాక్టర్‌ విజయసారథి శ్రీభాష్యం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఏపీ నుంచి యడ్ల గోపాలరావు (కళలు), దళవాయి చలపతిరావు (కళలు) కూడా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోనున్నారు. బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌జోహార్‌, ఏక్తా కపూర్‌, కంగనా రనౌత్‌, అద్నాన్‌ సమీ, క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌ తదితరులను కూడా పద్మశ్రీ వరించింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన పీడీపీ నేత ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌కు పద్మభూషణ్‌ ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారిలో 34 మంది మహిళలు, 18మంది విదేశీయులున్నారు. అలాగే నాలుగు జంటలను (ఇద్దరికి కలిపి ఒకే అవార్డు) కూడా ప్రభుత్వం ఈసారి పద్మశ్రీకి ఎంపిక చేసింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.


సామాన్య రైతుకు ‘పద్మశ్రీ’

హైదరాబాద్‌కు చెందిన సామాన్య రైతు చింతల వెంకట్‌రెడ్డిని ఈసారి పద్మశ్రీ అవార్డు వరించింది. వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో రైతు కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచి వ్యవసాయం పట్ల ఆయనకున్న ఆసక్తి.. విద్యాభ్యాసం అనంతరం వ్యవసాయ రంగంపై మొగ్గుచూపేలా చేసింది. వరి, గోధుమ, చెరకు, కూరగాయలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు తదితర పంటలను విజయవంతంగా సాగుచేసిన వెంకట్‌రెడ్డి పదేండ్లపాటు నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంస్థల్లో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. వెంకట్‌రెడ్డికి కీసరలోని కుందన్‌పల్లిలో ద్రాక్ష తోట, అల్వాల్‌లో అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఫామ్‌ ఉన్నాయి. నగరంలో సొంత ఆలోచనలు, అనుభవాలతో పూర్తిగా స్వదేశీ పద్ధతుల్లో సాగు అవలంబించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ద్రాక్ష సాగులో డ్రిప్‌ ఇరిగేషన్‌, సేంద్రియ పద్ధతులను ఆయన పరిచయం చేశారు. శాస్త్రీయ, వినూత్న ద్రాక్ష సాగు ద్వారా హెక్టారుకు 105 టన్నుల దిగుబడి సాధించి రికార్డు నెలకొల్పారు. సాంకేతికను ఉపయోగించి అధిక పోషక విలువలు కలిగిన వరి, గోదుమలను పండించారు. రసాయనాలను వాడకుండా సాగు భూముల్లో భూసారం పెంచే ప్రక్రియను కనిపెట్టారు. భారత్‌తోపాటు యురేషియా, దక్షిణాఫ్రికా, మడగాస్కర్‌, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, వియత్నాం ఐరోపా తదితర దేశాల్లో సాగులో వాడే సాంకేతికతపై పెటేంట్‌ హక్కులు పొందారు. 2006లో ఉత్తమ రైతు పురస్కారంతోపాటు పలు అవార్డులను అందుకున్నారు.


సాహితీ కృషికి దక్కిన గుర్తింపు

పద్మశ్రీకి ఎంపికైన శ్రీభాష్యం విజయసారథి కరీంనగర్‌ జిల్లాలోని చేగుర్తిలో 1936లో జన్మించారు. ఆయన సంస్కృతంలో దాదాపు 100 పుస్తకాలను రాసిన గొప్ప సాహితీవేత్త. చిన్నతనంలో ఉర్దూ మీడియంలో చదివినా.. సంస్కృతంలోనూ మంచి పట్టు సాధించారు. మందాకిని, ప్రవీణ భారతం, భారత భారతి వంటి పుస్తకాల ద్వారా భారతదేశ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను వివరించారు. స్ఫూర్తిదాయక, ప్రగతిశీల రచయితగా ఆయన గుర్తింపు పొందారు. సాహితీరంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఇప్పటికే మహామహోపాధ్యాయ, వాచస్పతి పురస్కార్‌, ఇందిరా బిహరేయ్‌ గోల్డ్‌ మెడల్‌, యుగకర్త వంటి అవార్డులను అందుకున్నారు. శిక్షణ తరగతులు, విద్వత్సభల నిర్వహణ ద్వారా సంస్కృత భాష వ్యాప్తికి విజయసారథి కృషిచేశారు. దేశీయ కవితా రూపమైన సీసం, సంస్కృత సాహిత్యంలో భత్రులేఖ వంటి రూపాలను పరిచయం చేశారు. ఆయన రచించిన మందాకిని కావ్యానికి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులతోపాటు, యుగకర్త అవార్డు లభించింది. పురాతన వేదాల్లో కనిపించే ‘సూక్తా ప్రక్రియా’ను ఆధునిక, సామాజిక అవగాహనతో విజయసారథి పరిచయం చేశారు. పద్మశ్రీ అవార్డుకు శ్రీభాష్యం విజయసారథి ఎంపికైన సందర్భంగా ఆయనను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. 


లాయర్‌ టు లీడర్‌

దేశ ఆర్థిక వ్యవస్థలో అనూహ్య పరిణామాలకు కారణమైన పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ వంటి సంస్కరణల్లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ కీలక భూమిక పోషించారు. ఆయన 1952లో డిసెంబర్‌ 28న ఢిల్లీలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలులో గడిపారు. విడుదలయ్యాక జనసంఘ్‌ లో చేరారు. విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రధానిగా పనిచేసిన కాలంలో జైట్లీ సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి బీజేపీ కార్యవర్గంలో పనిచేశారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. పలు రాష్ట్రాలలో బీజేపీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమృత్‌సర్‌ నుంచి పోటీపడి ఓటమి పాలయ్యారు. అయితే 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడంతో జైట్లీని రాజ్యసభ సభ్యుడిని చేసి ఆర్థికమంత్రి పదవిని అప్పగించారు. ఈ కాలంలోనే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకున్నది. జైట్లీ క్యాన్సర్‌తో బాధపడుతూ గతేడాది ఆగస్టు 24న తుది శ్వాస విడిచారు.


సోషలిస్ట్‌ నేత

జార్జ్‌ మాథ్యూ ఫెర్నాండెజ్‌.. 1930 జూన్‌ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. న్యాయవాది కావాలని తండ్రి ఆశించగా మతాధికారి అయ్యేందుకు బెంగళూరులోని సెయింట్‌ పీటర్స్‌ సెమినరీలో తత్వశాస్ర్తాన్ని అభ్యసించారు. చర్చి సిద్ధాంతాలు నచ్చక ముంబై కు వెళ్లారు.  వార్తాపత్రికలో ఉద్యోగం లభించేంత వరకు పస్తులుంటూ రోడ్ల పక్కగా పడుకున్నారు. కార్మిక నేత ప్లసిడ్‌ డి మెల్లో, సోషలిస్ట్‌ నేత రామ్‌మనోహర్‌ లోహియా  పరిచయంతో ఆయన జీవితం మారిపోయింది. కార్మిక ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలోనూ జైలుకెళ్లారు. తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికై రైల్వే, రక్షణ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2019 జనవరి 29న తుదిశ్వాస విడిచారు.


logo