గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 02:50:52

భారత్‌లో ‘ఆక్స్‌ఫర్డ్‌ టీకా’ ట్రయల్స్‌

భారత్‌లో ‘ఆక్స్‌ఫర్డ్‌ టీకా’ ట్రయల్స్‌

  • l ఆగస్టు చివరికి ప్రారంభం.. వచ్చే జూన్‌లో ఉత్పత్తి
  • l ఇక్కడినుంచే 60దేశాలకు వ్యాక్సిన్‌.. 50% మనకే
  • l భారతీయులకు ప్రభుత్వాల ద్వారా ఉచితంగానే టీకాలు! 
  •  l సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడి 

ముంబై, జూలై 21: బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ ఆగస్టు చివరినాటికి భారత్‌లో ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి హక్కులు సాధించిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఐదు వేల మంది వలంటీర్లపై ప్రయోగం చేయనున్నట్టు ప్రకటించింది. అన్నీ సాఫీగా సాగితే వచ్చే ఏడాది జూన్‌ నాటికి టీకాను మార్కెట్లోకి తెస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా మంగళవారం తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీకి తుది అనుమతులు రాకముందే తాము 20కోట్ల డాలర్లు వెచ్చించి 30కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేయనున్నట్టు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారు అయిన ఈ సంస్థ 20కోట్ల డాలర్ల సొమ్మును నష్టభయాన్ని పట్టించుకోకుండా పెట్టుబడి పెడుతున్నది. వ్యాక్సిన్‌ వాడటానికి అనుమతి వస్తే 30కోట్ల డోసులు అమ్ముకోవటానికి వీలవుతుంది. లేదంటే ఉత్పత్తి వ్యయం మొత్తం వృథా అవుతుంది. భారత్‌తోపాటు మరో 60 దేశాల్లోని 300 కోట్ల జనాభాకు తమ సంస్థే వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నదని పూనావాలా వెల్లడించారు. భారత ఔషధ నియంత్ర మండలి అనుమతి లభించిన 48గంటల్లో వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.


logo