బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 06, 2020 , 11:59:42

ఏపీలో ‘కొవిషీల్డ్‌’ హ్యూమన్‌ ట్రయల్స్‌

ఏపీలో ‘కొవిషీల్డ్‌’ హ్యూమన్‌ ట్రయల్స్‌

విశాఖపట్నం : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా జనం అల్లాడుతున్నారు. వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. పలు కంపెనీలు తయారు చేస్తున్న టీకాలు తుది దశలో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల సహకారంతో ఆస్ట్రాజెనెకా టీకాను తయారుచేస్తున్నది. ఇండియాలో దీన్ని ‘కొవిషీల్డ్‌’ పేరుతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ఉత్పత్తి, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

దేశంలోని పలు చోట్ల టీకా మావన పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌, ఆంధ్రా మెడికల్‌ కళాశాలలోనూ ట్రయల్స్‌ ప్రారంభించారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ముగ్గురు వలంటీర్లకు మొదటి డోసు ఇచ్చినట్లు చెప్పారు. టీకా కోసం వలంటీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 15 మంది పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు.

కేజీహెచ్‌లో వంద మంది వలంటీర్లకు టీకా వేయనున్నారు. కరోనా నెగెటివ్ వ్యక్తులకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని డాక్టర్ సుధాకర్ తెలిపారు. వలంటీర్ల పరీక్ష శనివారం ప్రారంభమైందని, నివేదికలు వచ్చిన తర్వాత సోమవారం వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం రక్త నమూనాలను సేకరించి యాంటీబాడీస్‌ అభివృద్ధిని విశ్లేషించనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ అనంతరం 29 రోజులకు రెండు, 57 రోజుల అనంతరం మూడు, 90 రోజు తర్వాత నాలుగో డోసు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.

మూడు నెలల తర్వాత మరోసారి రక్త నమూనాలను సేకరించి పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ)కు పంపనున్నారు. వ్యాక్సిన్ అభ్యర్థి కోసం దేశవ్యాప్తంగా 1,600 మందిపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారని, ట్రయల్స్‌ ముగిసిన అనంతరం టీకా ఫలితాలను ఎస్‌ఐఐ ప్రకటించనుంది. ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్, పది కో ఇన్వెస్టిగేటర్లు, ఏడుగురు సహాయక సిబ్బందితో సహా 18 మంది సభ్యుల బృందం ట్రయల్స్‌లో పాల్గొంటోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.