గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 02:59:52

కంచె కట్టగలవా

కంచె కట్టగలవా

  • కరోనా వ్యాక్సిన్ల సమర్థత ఎంత?
  • కణాల్లోకి వైరస్‌ చేరకుండా ఆపగలవా?
  • నిత్యం గుణం మార్చుకొనే వైరస్‌లు
  • వాటిపై వ్యాకిన్ల ప్రభావం ఎంతకాలం?
  • హడావుడి ట్రయల్స్‌తో నష్టమే ఆక్స్‌ఫర్డ్‌ నిపుణుల అభిప్రాయం

న్యూఢిల్లీ, జూలై 25: ప్రపంచవ్యాప్తంగా నేడు కరోనా పరుగుపందెం నడుస్తున్నది. ఒకవైపు పాజిటివ్‌ కేసులైతే, మరోవైపు వైరస్‌ను అడ్డుకొనే వ్యాక్సిన్‌ తయారీ. అందరికంటే ముందుగా వ్యాక్సిన్‌ తయారుచేసిన ఘనత కోసం ప్రపంచంలోని ప్రతి ఫార్మాకంపెనీ శక్తికి మించి పరుగెడుతున్నది. అందరికంటే ముందు తామే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తెస్తామని రష్యా ఇప్పటికే ప్రకటించగా, బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ తయారీలో తుది దశలో ఉన్నామని ప్రకటించింది. భారత్‌లోనూ వ్యాక్సిన్‌ తయారీకి భారీ పరుగుపందెమే నడుస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్లు వైరస్‌ను సమర్థంగా అడ్డుకోగలవా? అడ్డుగోడలు నిలుస్తాయా?

కరోనా నియంత్రణకు ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్లన్నీ అడ్డుగోడల్లాంటివి. మనిషి జీవకణాల్లోకి వైరస్‌ చొరబడకుండా అడ్డు నిలబడటమే వీటి పని. కొవిడ్‌-19 వైరస్‌పై బుడిపెల్లాంటి నిర్మాణాలుంటాయి. వాటిని స్పైక్‌ ప్రొటీన్లు అంటారు. వాటి సాయంతోనే వైరస్‌ జీవకణంలోకి చొరబడుతుంది. సరిగ్గా అక్కడే వ్యాక్సిన్‌ పని మొదలుపెడుతుంది. వ్యాక్సిన్‌ అంటే నిర్జీవంగా ఉండే యాంటీబాడీలు. ఈ యాంటీ బాడీలు వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ బొడిపెలపై ముసుగులాగా కప్పుకుంటాయి. దాంతో వైరస్‌ చేతులు కాళ్లు కట్టేసినట్టయ్యి జీవకణంలోకి వెళ్లలేదు. ఈ వ్యాక్సిన్లు శరీరంలో రోగకారక క్రిములతో పోరాడి తెల్లరక్త కణాలను (టీ-సెల్స్‌) ప్రేరేపిస్తాయి. అవి వైరస్‌ సోకిన జీవకణాలను ధ్వంసం చేస్తాయి. ఇలా రెండు రకాలుగా వ్యాక్సిన్‌ పనిచేస్తుంది. అయితే, ఈ అడ్డుగోడలు వైరస్‌ను ఎంతకాలం అడ్డుకోగలవనేది సమాధానం లేని ప్రశ్న. ఎందుకంటే శరీరంలో వ్యాక్సిన్‌ ప్రభావం తగ్గిపోతే అది ప్రేరేపించిన రోగ నిరోధకత కూడా తగ్గుతుంది. అప్పుడు శరీరంలో నిద్రాణంగా ఉన్న వైరస్‌ మళ్లీ విజృంభిస్తుంది.

వైరస్‌ లక్షణం మార్చుకొంటే?

సాధారణంగా వైరస్‌ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించినప్పుడు వాటి జన్యుక్రమంలో స్వల్ప మార్పులు వస్తాయి. దాంతో మనిషిపై అది దాడిచేసే విధానం కూడా మారుతుంది. ఇలా నిత్యం మారే వైరస్‌పై ఈ వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావం చూపుతాయన్నది శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. సాధారణంగా వ్యాపించే ఫ్లూ వైరస్‌లకు మార్కెట్లో ఇప్పటికే వ్యాక్సిన్లు ఉన్నాయి. ఏటా వైరస్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా వ్యాక్సిన్లలో కూడా కంపెనీలు మార్పులు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లలో కూడా ఈ ప్రక్రియ అనివార్యమని నిపుణుల అభిప్రాయం. అయితే వైరస్‌ జన్యు మార్పులో ఓ సానుకూలాంశం కూడా ఉన్నది. మారే సమయంలో దానిలో కొన్ని బలహీనతలు ఏర్పడుతాయి. ఆ బలహీనతలు గుర్తించి శాస్త్రవేత్తలు తగిన ఔషధాలను తయారుచేస్తుంటారు.

హడావిడే అసలు సమస్య

ప్రపంచవ్యాప్తంగా నేడు అందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసరం. ప్రభుత్వాలు తమంతతాముగానే నిబంధనలు సడలించి వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను వేగవంతం చేస్తున్నాయి. కానీ, ఒక వ్యాక్సిన్‌ తయారీకి అనేక దశల్లో కొన్ని వేలమందిపై పరీక్షించి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుత హడావిడిలో కొద్దిమందిపైనే వ్యాక్సిన్‌ను పరీక్షించే అవకాశం ఉంది. దాంతో వ్యాక్సిన్‌ సమర్థతను కచ్చితంగా తెలుసుకోలేమని నిపుణుల మాట. 


logo