మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 07:44:52

కరోనా వచ్చిన 3వేల మంది ఎక్కడ ? పోలీసుల సెర్చింగ్‌

కరోనా వచ్చిన 3వేల మంది ఎక్కడ ? పోలీసుల సెర్చింగ్‌

బెంగళూరు : కర్ణాటకలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. బెంగళూరు నగరంలోనే పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. బెంగళూరు పరిధిలో కరోనా టెస్టులు చేయించుకున్న వారిలో 3 వేల మందికి పైగా తప్పుడు చిరునామాలు, ఫోన్‌ నంబర్లు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ పరిశీలనలో తేలింది. వారందరికీ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. అధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాజిటివ్‌ వచ్చిందని వారికి చెబుదామంటే ఫోన్లు కలవకపోవడం.. ఇంటి అడ్రస్‌లు సరిగా లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు. 

3,338 మంది కరోనా పాజిటివ్‌ బాధితులు తప్పుడు అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో వీరి సంఖ్య 7 శాతంగా ఉందన్నారు. గత 14 రోజుల్లోనే 16 వేల నుంచి 27 వేలకు పాజిటివ్‌ కేసులు అమాంతం పెరిగిపోయాయి. కర్ణాటకలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో.. సగం కేసులు బెంగళూరు నుంచే ఉన్నాయి. అదృశ్యమైన కరోనా పాజిటివ్‌ బాధితుల ఆచూకీ కనుగొనడం కష్టంగా మారిందన్నారు. వారి నిర్లక్ష్యం వల్ల మరింత మందికి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఈ సందర్భంగా బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక కమిషనర్‌ ఎన్‌ మంజునాథ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. కొంతమంది పాజిటివ్‌ బాధితులను పోలీసుల సహాయంతో కనుగొన్నాం. కానీ ఇప్పటికి 3,338 మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. శాంపిల్స్‌ ఇచ్చే సమయంలోనే కొందరు తప్పుడు చిరునామాలు, ఫోన్‌ నంబర్లు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 

ఈ పరిణామాల దృష్ట్యా.. ప్రస్తుతం టెస్టులు చేయించుకుంటున్న వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందే వారి మొబైల్‌ నంబర్‌ మనుగడలో ఉందో లేదో తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకుంటున్నారు. 

గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 5 వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 72 మంది చనిపోయారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 90 వేల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 1,796 మరణాలు సంభవించాయి. బెంగళూరులో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 43,503కు చేరింది. 


logo