శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 21:34:44

యూపీలో ఒకేరోజు 25కోట్ల మొక్కల నాటింపు

యూపీలో ఒకేరోజు 25కోట్ల మొక్కల నాటింపు

గోరఖ్‌పూర్‌ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఓ బృహత్‌ కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే ఏకంగా 25కోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమ విజయవంతంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 26కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకోగా 25.75 కోట్లు నాటినట్లు ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో చిన్నపిల్లలను, వృద్ధులను ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సామాజిక కార్యకర్తలు, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే సంస్థలు మొక్కలు నాటి రికార్డుస్థాయి లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వివరించారు. ఈ లక్ష్యం నెరవేరేందుకు ఏడాది నుంచి విశేష కృషి చేస్తున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితోపాటు కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సీఎం యోగి కృతజ్ఞతలు తెలిపారు. గంగ, గోమతి నదుల ఒడ్డున విస్తారంగా మొక్కలు నాటినట్లు చెప్పారు. భవిష్యత్‌లో మరో 30కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. logo