శుక్రవారం 10 జూలై 2020
National - Jul 01, 2020 , 06:58:43

అసోంలో భారీ వర్షాలు.. 13.2 లక్షల మందిపై ప్రభావం.. 25 మంది మృతి

అసోంలో భారీ వర్షాలు.. 13.2 లక్షల మందిపై ప్రభావం.. 25 మంది మృతి

గౌహతి : ఎడతెగని వర్షాలతో అసోం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరదలు భయంకరంగా కొనసాగుతున్నాయి. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపిన నివేదిక ప్రకారం.. ఉడల్‌గురి, కమ్రప్‌(మెట్రో) ప్రాంతాల్లో ప్రస్తుతానికి వరద ఉథృతి తగ్గగా థెమాజీ, దక్షిణ సల్మారా, లఖంపూర్‌, నల్బరి, బార్పేట, కోక్రాజార్‌, గోల్‌పారా, కమ్రప్‌, మోరిగావ్‌, గోలఘాట్‌, జోర్హాట్‌, దిర్హాట్‌ తదితర జిల్లాలో కొనసాగుతుంది. 

మొత్తం 33 జిల్లాలకుగాను 25 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 13.2 లక్షల మంది వరదల కారణంగా ప్రభావానికి గురయ్యారు. మృతుల సంఖ్య 25కు చేరుకుంది. నివేదిక ప్రకారం బార్పేట జిల్లా వరదల కారణంగా అత్యంత ప్రభావానికి గురైంది. జిల్లాలో 75,700 హెక్టార్ల వ్యవసాయ భూమి కోతకు గురైంది. గడిచిన 24 గంటల్లో జిల్లా యంత్రాంగం మెరూన్‌ ప్రజలను 3,245 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 

గోలాఘాట్‌లోని కజిరంగ నేషనల్‌ పార్క్‌, మొరిగావ్‌లోని పోబిటోరా వన్యప్రాణాల అభయారణ్యం, మంగల్‌డోయిలోని ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌ వరదలతో మునిగిపోయాయి. 21 జిల్లాల్లో అధికారులు 265 సహయక శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిలో 25,461 మందికి ఆశ్రయం కల్పించారు. గౌహతి, జోర్హాట్‌లోని నీమాటిఘాట్‌, సోనిత్‌పూర్‌లోని తేజ్‌పూర్‌, గోల్‌పారా పట్టణం, దుబ్రీ పట్టణాల వద్ద బ్రహ్మపుత్ర నదీ ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది. వరదల ధాటికి వివిద ప్రాంతాల్లో కట్టలు, రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, ఇతర అనేత మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.   


logo