సోమవారం 30 మార్చి 2020
National - Feb 13, 2020 , 12:21:47

24 గంటల్లో 'ఆప్‌'లో చేరిన 11 లక్షల మంది

24 గంటల్లో 'ఆప్‌'లో చేరిన 11 లక్షల మంది

న్యూఢిల్లీ : వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆనందోత్సహాల్లో మునిగితేలుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆప్‌కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. అయితే ఆ పార్టీలో కేవలం 24 గంటల్లోనే 11 లక్షల మంది చేరారు. ఇదేలా సాధ్యమైందంటే.. ఆప్‌ నాయకత్వం ఈ నెల 11వ తేదీన 9871010101 మొబైల్‌ నంబర్‌ను మీడియా ద్వారా షేర్‌ చేసింది. ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే ఆప్‌లో చేరినట్లే అని పార్టీ నాయకత్వం సూచించింది. దీంతో 11 లక్షల మంది మిస్డ్‌ కాల్‌ ఇచ్చి ఆప్‌ క్యాంపెయిన్‌లో భాగస్వాములై మద్దతు తెలిపారు. దేశ వ్యాప్తంగా తమ పార్టీలో 11 లక్షల మంది చేరారని ఆప్‌ నాయకులు వెల్లడించారు.

ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆమ్‌ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో గెలవగా, భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్‌ ఖాతానే తెరవలేదు. ఇక భారీ విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ నెల 16న ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఢిల్లీ ప్రజలందరూ హాజరై మీ బిడ్డగా ఆయనను ఆశీర్వదించాలని మనీష్‌ సిపోడియా విజ్ఞప్తి చేశారు. 


logo