శనివారం 11 జూలై 2020
National - Jun 18, 2020 , 13:01:47

గాల్వాన్‌ లోయలో ఏమి జరిగిందంటే..

గాల్వాన్‌ లోయలో ఏమి జరిగిందంటే..

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో సోమవారం నుంచి మంగళవారం వరకు భారత్‌, చైనా సైనికుల మధ్య సుమారు ఏడు గంటల పాటు ఘర్షణ జరిగినట్లు తెలుస్తున్నది. మన సైనికులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ చైనా సైనికులతో జరిగిన ముఖాముఖి ఘర్షణలో దీటుగానే జవాబిచ్చినట్లు సమాచారం.

లఢక్‌ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని తగ్గించుకునేందుకు జూన్‌ 6న లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, దక్షిణ జిన్జియాంగ్ ప్రాంతంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా భారత వాస్తవధీన రేఖకు సమీపంలో గస్తీ నిర్వహించే పాయింట్ 14 సమీపానికి వచ్చిన చైనా సైనికులు 5 కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాలి. ఈ చర్చల నేపథ్యంలో గత వారం చైనా సైనికులు కాస్త వెనక్కి వెళ్లారు. 

అయితే ఈ ఘర్షణ గురించి తెలిసిన వారి సమాచారం ప్రకారం.. చైనా సైనికులు సోమవారం మళ్లీ ఆ స్థానానికి తిరిగివచ్చారు. చైనా శిబిరంలో సుమారు 250 మంది సైనికులు ఉన్నారు. అయితే యథాతథ స్థితిని కొనసాగించాలని కల్నల్‌ సంతోష్‌ బాబు నేతృత్వంలోని 50 మంది సైనికులు చైనా సైనికులను కోరారు. అయితే చైనా సైనికులు ఆ ప్రాంతాన్ని వీడేందుకు నిరాకరించారు. దీంతో భారత ఆధీనంలోని నియంత్రణ రేఖ వైపు ఉన్న చైనా టెంట్‌తోపాటు వారి నిఘా పోస్టును భారత సైనికులు తొలగించారు. 

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 7 గంటలకు ఇరువైపుల ఘర్షణ తలెత్తింది. కొద్ది సమయంలోనే ఇది ముఖాముఖి పోరుకు దారితీసింది. పాయింట్‌ 14 నుంచి సమీపంలోని నదీ తీర ప్రాంతంలోని ఇరుకైన శిఖరం వరకు ఈ ఘర్షణ విస్తరించింది. ఇరు దేశాలకు చెందిన సుమారు 500 మంది సైనికుల మధ్య రాత్రి వేళ సుమారు ఏడు గంటలపాటు ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతోపాటు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే చైనా సైనికులు ఇనుప రాడ్లు, మేకులున్న కర్రలతో భారత జవాన్లపై దాడి చేసినట్లు ఈ ఘర్షణ గురించి ప్రత్యక్షంగా తెలిసిన కొందరు తెలిపారు. 

తొలుత కల్నల్‌ సంతోష్‌ బాబు, మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరింత మంది భారత జవాన్లు అక్కడకు వచ్చి చైనా సైనికులతో తలపడ్డారు. అర్థరాత్రి వరకు జరిగిన ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన కొందరు సైనికులు నదిలో పడి మరణించగా వారి మృతదేహాలను మంగళవారం వెలికితీశారు. ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులుకాగా, సుమారు 40-45 మంది చైనా సైనికులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని తెలుస్తున్నది. logo