శనివారం 16 జనవరి 2021
National - Jan 04, 2021 , 17:39:04

కోవాగ్జిన్‌పై రాజ‌కీయాలు వ‌ద్దు : భార‌త్ బ‌యోటెక్ ఎండీ

కోవాగ్జిన్‌పై రాజ‌కీయాలు వ‌ద్దు :  భార‌త్ బ‌యోటెక్ ఎండీ

హైద‌రాబాద్‌: భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ వినియోగం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విప‌క్షాలు ఆ వ్యాక్సిన్ స‌మ‌ర్ధ‌త‌‌పై అనుమానాలు వ్య‌క్తం చేశాయి. ఎటువంటి డేటా ఇవ్వ‌కుండా కోవాగ్జిన్ టీకాకు ఎలా అనుమ‌తి ఇస్తార‌ని విప‌క్షాలు నిల‌దీశాయి. ఈ సంద‌ర్భంగా ఇవాళ భార‌త్‌బ‌యోటెక్ సంస్థ చైర్మ‌న్ కృష్ణ ఎల్లా మీడియాతో మాట్లాడారు. త‌మ సంస్థ‌కు అనుభ‌వం లేద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు అని ఆయ‌న అన్నారు.  త‌మ‌ది గ్లోబ‌ల్ కంపెనీ అని, ఇప్ప‌టికే అనేక ర‌కాల వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  త‌మ కంపెనీ ఇప్ప‌టి వ‌ర‌కు 16 ర‌కాల టీకాల‌ను త‌యారు చేసిన‌ట్లు కృష్ణ ఎల్లా చెప్పారు.  

బ్రిట‌న్‌లోనూ ట్ర‌య‌ల్స్‌..

వాస్త‌వానికి కోవాగ్జిన్ మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. కానీ ఆ టీకాకు స‌డ‌న్‌గా అనుమ‌తి ఇవ్వ‌డం ప‌ట్ల వివాదం త‌లెత్తింది.  ఈ నేప‌థ్యంలో వివ‌ర‌ణ ఇచ్చిన చైర్మ‌న్ కృష్ణ ఎల్లా.. త‌మ సంస్థ ప్ర‌పంచ దేశాల కోసం టీకాల‌ను త‌యారు చేస్తుంద‌న్నారు.  కేవ‌లం భార‌త్‌లో మాత్ర‌మే త‌మ టీకాల‌ను వాడ‌ర‌న్నారు. కోవాగ్జిన్ కోసం బ్రిట‌న్‌లోనూ ట్ర‌య‌ల్స్ జ‌రిగాయ‌న్నారు.  డేటా అంశంలో పార‌ద‌ర్శ‌కంగా లేమ‌ని చెప్ప‌డం అస‌త్య‌మ‌ని ఆయ‌న అన్నారు. కోవాగ్జిన్‌కు ఎమ‌ర్జెన్సీ ఆమోదం ద‌క్క‌డం ఓ గొప్ప సంకేత‌మ‌న్నారు. భార‌త్ అభివృద్ధి చేసిన ఉత్ప‌త్తికి ఇది అరుదైన ఘ‌న‌త అని అన్నారు.  దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భమ‌ని, భార‌త శాస్త్రీయ సామ‌ర్థ్యంలో ఇదో మైలురాయి అని కృష్ణ ఎల్ల తెలిపారు. ఇన్నోవేష‌న్ వాతావ‌ర‌ణ క‌ల్ప‌నకు ఇది ఆరంభం అన్నారు. 

రాజ‌కీయాలు వ‌ద్దు..

మ‌హ‌మ్మారి వేళ వ్యాక్సిన్‌తో వైద్య అవ‌స‌రాల‌ను తీర్చాల‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా అవ‌స‌ర‌మైన వారికి త‌మ వ్యాక్సిన్ అందించ‌డ‌మే త‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని ఎల్ల తెలిపారు. కోవాగ్జిన్ టీకా అత్యంత సుర‌క్షిత‌మైంద‌ని, ఆ టీకాతో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా ఘ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌న్నారు. అయితే మ‌న‌వాళ్లు వ్యాక్సిన్‌పై రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.  త‌మ కుటుంబానికి చెందిన ఒక్క‌రు కూడా ఎటువంటి రాజ‌కీయ పార్టీతో లింకులో లేర‌న్నారు.  తాము కేవ‌లం ఇండియాలో మాత్ర‌మే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌డం లేద‌ని, బ్రిట‌న్‌తో పాటు 12 దేశాల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేశామ‌ని, పాకిస్థాన్‌, నేప‌ల్‌, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోనూ త‌మ టీకా ట్ర‌య‌ల్స్ జ‌రిగిన‌ట్లు ఎల్ల వెల్ల‌డించారు. మాది కేవ‌లం ఇండియ‌న్ కంపెనీ మాత్ర‌మే కాదు, మాది నిజ‌మైన గ్లోబ‌ల్ కంపెనీ అని భార‌త్ బ‌యెటెక్ ఎండీ తెలిపారు.  

అపార అనుభ‌వం.. 

త‌మ కంపెనీకి వ్యాక్సిన్ ఉత్ప‌త్తిలో అపార అనుభ‌వం ఉన్న‌ట్లు కృష్ణ ఎల్ల తెలిపారు. వ్యాక్సిన్ ఉత్ప‌త్తిలో త‌మ‌కు అనుభ‌వం లేద‌ని చెప్పడం శోచ‌నీయ‌మ‌న్నారు.  123 దేశాల్లో త‌మ వ్యాక్సిన్ ఉత్ప‌త్తుల‌ను వాడుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  త‌మ కంపెనీకి చాలా విస్తృత‌మైన అనుభ‌వం ఉంద‌ని, సైంటిఫిక్ జ‌ర్న‌ల్స్‌లోనూ త‌మ‌కు గుర్తింపు ఉన్న‌ట్లు ఎల్ల తెలిపారు. కోవాగ్జిన్ డేటా విష‌యంలో పార‌ద‌ర్శ‌కంగా లేర‌ని త‌మ‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని,  ఓపిక ఉన్న వాళ్లు ఇంట‌ర్నెట్‌లో సెర్చ్ చేస్తే, తాము ఎన్ని నివేదిక‌లు రాశామో అర్థం అవుతుంద‌న్నారు.  అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల్లో సుమారు 70 ఆర్టిక‌ల్స్ వ‌చ్చిన‌ట్లు కృష్ణ ఎల్ల తెలిపారు.