బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 01:48:05

‘అగ్రి’ బిల్లులపై రైతన్న ఆగ్రహం

‘అగ్రి’ బిల్లులపై రైతన్న ఆగ్రహం

  • కేంద్రం తెచ్చిన మూడు బిల్లులపై వ్యతిరేకత
  • పలు రాష్ర్టాల్లో రైతు సంఘాల ఆందోళనలు
  • కార్పొరేట్ల కోసమే బిల్లులు తెచ్చారంటున్న ప్రతిపక్షం
  • అన్నదాతల ఆదాయం పెరుగుతుందంటున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కీలక బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందులో వ్యవసాయ మార్కెట్ల సంస్కరణ, పంటల ఒప్పంద నిబంధనలకు సంబంధించిన బిల్లులకు గురువారం ఆమోదం తెలుపగా, నిత్యావసర సరుకుల (సవరణ) -2020 బిల్లుకు మంగళవారమే ఆమోదం లభించింది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్‌ నాయకురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ గురువారం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, బిల్లులను నిరసిస్తూ పలు రాష్ర్టాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మండీల వ్యవస్థ బలంగా ఉండే పంజాబ్‌, హర్యానాల్లో వీటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.

రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు-2020

రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనే (మండీలు) కాకుండా దేశంలో ఎక్కడైనా విక్రయించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రత్యామ్నాయ వ్యాపార మార్గాల ద్వారా రైతులకు మంచి ధర కల్పించడమే దీని ఉద్దేశం. ఈ బిల్లు ప్రకారం రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు ఎలాంటి పన్ను, రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రయోజనం 

పంటను విక్రయించేందుకు రైతులకు మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. మార్కెటింగ్‌ వ్యయం తగ్గుతుంది. పంటకు మంచి ధర లభించే అవకాశం ఉన్నది. 

వ్యతిరేకత ఎందుకు?

రైతులు వ్యవసాయ మార్కెట్లకు వెలుపల పంటను విక్రయిస్తే మండీ ఫీజును కోల్పోవడం వల్ల రాష్ర్టాలు ఆదాయం కోల్పోతాయి. వ్యవసాయ క్రయవిక్రయాలు పూర్తిగా మండీలకు వెలుపల జరిగినట్లయితే కమిషన్‌ ఏజెంట్లు ఉపాధి కోల్పోతారు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్లు అంతిమంగా కనీస మద్దతు ధరకు ముగింపు పలుకుతుందని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్‌ దోపిడీ పెరుగుతుందని ఆరోపిస్తున్నాయి.

 రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పంద బిల్లు-2020

రైతులు తాము పండించే పంటను ముందుగానే నిర్ణీత ధరకు విక్రయిస్తూ ప్రైవేట్‌ సంస్థలు, వ్యక్తులతో ఒప్పందం చేసుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. 

ప్రయోజనం 

దీని వల్ల మార్కెట్‌ రిస్క్‌ ప్రభావం రైతులపై కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులపై పడుతుంది. రైతులకు మార్కెటింగ్‌ వ్యయం తగ్గుతుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది.

వ్యతిరేకత ఎందుకు?

దేశ ఆహార, వ్యవసాయ వాణిజ్యంపై గుత్తాధిపత్యాన్ని కోరుకునే బడా కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందని వ్యవసాయ సంఘాలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని వల్ల రైతులు బేరమాడే శక్తిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్‌ కంపెనీలు, ఎగుమతిదారులు, హోల్‌సేల్‌ దారులు, ప్రాసెసర్లకే ఇది ప్రయోజనకరమని ఆరోపిస్తున్నాయి.

నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు-2020

ప్రకృతి విపత్తులు, యుద్ధ పరిస్థితులు, ఇతర అసాధారణ పరిస్థితుల్లో మినహా మిగిలిన సమయాల్లో నిత్యావసర సరుకుల జాబితా నుంచి తృణధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు వంటి వాటిని తొలగించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అలాగే వీటి నిల్వలపై పరిమితులను కూడా ఎత్తివేసేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. 

ప్రయోజనం 

వ్యవసాయ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులు/ఎఫ్‌డీఐలను ఆకర్షించే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ధరల స్థిరీకరణకు కూడా ఈ బిల్లు దోహదపడుతుంది.

వ్యతిరేకత ఎందుకు?

సరుకుల నిల్వలపై పెద్ద కంపెనీలకు స్వేచ్ఛ లభిస్తుందని, రైతులపై వారు పెత్తనం చెలాయిస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

కేంద్రం ఏం చెబుతున్నది?

పంటలకుకనీస మద్దతు ధర ఇకపైనా కొనసాగుతుందంటున్నది. రాష్ర్టాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ) చట్టాలను ఈ బిల్లులు అతిక్రమించబోవని చెప్తున్నది. 


logo