మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 02:59:00

ర్యాంకుల పరుగులు వదిలి జ్ఞానార్జనవైపు!

ర్యాంకుల పరుగులు వదిలి జ్ఞానార్జనవైపు!

 • హెచ్చార్డీశాఖ పేరు విద్యాశాఖగా మార్పు
 • విద్యార్థి ఇష్టప్రకారం చదువుకొనే అవకాశం
 • ఉన్నత విద్య మొత్తం ఒకే సంస్థ నియంత్రణలో
 • 6వ తరగతి నుంచే వృత్తివిద్య నైపుణ్యాలు
 • 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
 • దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు
 • నూతన విద్యావిధానానికి కేంద్రం ఆమోదం
 • 10+2 విద్యావిధానం స్థానంలో.. 5+3+3+4 విధానం
 • పాఠశాల స్థాయిలో 3, 5, 8 తరగతులకే వార్షిక పరీక్షలు
 • 14 ఏండ్లలోపువారికి ఉన్న నిర్బంధ విద్య.. 
 • 18 ఏండ్లవరకు పొడిగింపు
 • అన్ని స్థాయిల్లో ఆప్షనల్‌గా సంస్కృతం 
 • యూజీ విద్య మూడు లేదా నాలుగేండ్లు

జాతీయ విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. నూతన విద్యావిధానానికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. నూతన విద్యావిధానం బాగానే ఉన్నా.. అందరూ బాధ్యత వహిస్తేనే అమలు సాధ్యమని నిపుణులు అంటున్నారు. దీని అమలుకు కేంద్రం నిధులను భారీగా కేటాయించాలని చెప్తున్నారు. మరోవైపు నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులకు ఉపయోగాల కంటే నష్టాలే అధికంగా ఉంటాయనే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. ప్రత్యేకించి శాఖ పేరు మార్పుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.

న్యూఢిల్లీ, జూలై 29: దేశంలో విద్యావ్యవస్థను సమూలంగా మార్చివేసే కార్యక్రమానికి తెరలేచింది. విజ్ఞానం, ఉపాధి మార్గం చూపేదే అసలైన విద్య అన్న సూత్రం ఆధారంగా రూపొందించిన నూతన విద్యావిధానం-2020కు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌.. కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్చార్డీ) పేరును విద్యాశాఖగా మార్చే ప్రతిపాదనను కూడా ఆమోదించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా పెద్దగా మార్పులేమీ లేకుండా కొనసాగుతున్న భారతీయ విద్యావిధానాన్ని ఎన్‌ఈపీ-2020 సంపూర్ణంగా మార్చనున్నదని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. ముక్కలుచెక్కలుగా కొనసాగుతున్న ఉన్నత విద్యారంగం మొత్తం ఇక ఒకే గొడుగు కిందికి  రానున్నది. ఎన్‌ఈపీ-2020 వివరాలను ఉన్నతవిద్యశాఖ కార్యదర్శి అమిత్‌ఖేర్‌, పాఠశాల విద్య కార్యదర్శి అనితా కర్వాల్‌ మీడియాకు వెల్లడించారు.  

పాఠశాల విద్య

 • విద్యావిధానంలో 5+3+3+4 ఫార్ములా ఇకనుంచి కీలకంగా మారనుంది. మొదటి ఐదేండ్ల విద్యలో తొలి మూడేండ్ల కాలాన్ని అంగన్‌వాడీ లేదా ప్రీ ప్రైమరీ అంటారు. 3నుంచి 6 ఏండ్లలోపు చిన్నారులకు ఈ దశ ఉంటుంది. నాలుగో ఏడును 1వ తరగతిగా, 5వ ఏడును 2వ తరగతిగా పరిగణిస్తారు. 7, 8వ ఏట ఈ తరగతులు చదువుతారు. మొదటి +3 అంటే 3నుంచి 5వ తరగతి వరకు 8-11 ఏండ్ల లోపు విద్యార్థులు చదువుతారు. రెండో +3 అంటే 6నుంచి 8వ తరగతి వరకు 11నుంచి 14 ఏండ్లలోపు విద్యార్థులు, చివరి +4 అంటే 9నుంచి 12వ తరగతి వరకు 14-18 ఏండ్లలోపు విద్యార్థులు చదువుతారు. 
 • మూడేండ్ల అంగన్‌వాడీ విద్య (ప్రీప్రైమరీ)తోకలిపి పాఠశాల విద్య 12 ఏండ్లు ఉంటుంది. అంగన్‌వాడీ విద్య తర్వాత 1, 2 తరగతులు ఉంటాయి. ఆ తర్వాత 3 నుంచి 5 తరగతుల వరకు ప్రాథమిక స్థాయి, 6-8 వరకు మాధ్యమిక స్థాయి, 9-12 వరకు సెకండరీ స్థాయి విద్య ఉంటుంది. 
 • 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు ఉంటాయి. కానీ, వీటి ప్రాధాన్యాన్ని తగ్గిస్తారు. బట్టీ విధానం స్థానంలో జ్ఞానార్జనకు ప్రాధాన్యం ఇస్తారు. పదో తరగతిలోపు 3, 5,8 తరగతులకు మాత్రమే పాఠశాలల్లో వార్షిక పరీక్షలు ఉంటాయి.  
 • 1 నుంచి 5 తరగతుల వరకు కచ్చితంగా మాతృభాషలోనే విద్యాబోధన సాగాలి.  6వ తరగతి నుంచే సిలబస్‌లో వృత్తివిద్యను ప్రవేశపెడుతారు. పాఠశాల సిలబస్‌ను తగ్గిస్తారు.
 • అన్ని స్థాయిల్లో సంస్కృతం అత్యంత ముఖ్యమైన ఎంపిక (ఆప్షనల్‌) సబ్జెక్టుగా ఉంటుంది. త్రీ లాంగ్వేజ్‌ ఫార్ములాలో కూడా సంస్కృతాన్ని ఒక సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. 
 • సెకండరీ స్థాయిలో విదేశీ విద్యలైన కొరియన్‌, జపనీస్‌, థాయ్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, పోర్చుగీస్‌, రష్యన్‌ భాషలను బోధించవచ్చు. 
 • అన్ని రాష్ర్టాలు స్టేట్‌ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎస్‌ఎస్‌ఎస్‌ఏ)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 
 • అన్నివర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి ఎస్సీఆర్టీఈలు స్కూల్‌ క్వాలిటీ అసెస్‌మెంట్‌, అక్రెడిటేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎస్‌క్యూఏఏఎఫ్‌)ను అభివృద్ధి చేస్తాయి. 
 • రాష్ర్టాలు స్థానిక ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని సొంత కరికులం, పాఠ్యపుస్తకాలు తయారు చేసుకోవచ్చు.
 • అన్ని ప్రాంతీయ భాషల్లో పాఠ్యపుస్తకాలు అందించాలి. 
 • స్కూల్‌బ్యాగ్‌ బరువును తగ్గించేలా పాఠ్యపుస్తకాలు, సిలబస్‌లో తగిన మార్పులు చేయాలి. 
 • బడి మానేసిన 2 కోట్ల మంది పిల్లలను తిరిగి బడిలో చేర్పించాలనేది లక్ష్యం.
 • విద్యార్థులకిచ్చే రిపోర్ట్‌ కార్డులో మార్కులు మాత్రమేకాకుండా విద్యార్థి నైపుణ్యాలను కూడా నమోదుచేస్తారు. 
 • ప్రాంతీయ భాషల్లో ఈ-కోర్సులు, వర్చువల్‌ ల్యాబులు
 • నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఫోరమ్‌ ఏర్పాటుచేస్తారు. 
 • నేషనల్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ను నెలకొల్పుతారు. 

ఉన్నత విద్య

 • దేశంలో వృత్తి విద్య చదువుతున్నవారు 2018 లెక్కల ప్రకారం 26.3శాతం ఉన్నారు. 2035 నాటికి దీనిని 50శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. 
 • ఉన్నత విద్యలో మరో 3.5 కోట్ల కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చేలా విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహిస్తారు.
 • అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్య (యూజీ) మూడు లేదా నాలుగేండ్లు ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థి డిగ్రీ కోర్సు మొత్తం పూర్తిచేసిన తర్వాతే సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేస్తుండగా ఇకనుంచి విద్యార్థి ఎప్పుడైనా కోర్సు నుంచి వెళ్లిపోయేందుకు అవకాశం కల్పిస్తారు. కోర్సు మధ్యలోనే వెళ్లిపోతే అప్పటివరకే విద్యార్థి ప్రతిభను మధింపు చేసి సర్టిఫికేట్‌ ఇస్తారు.
 • ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఉండేలా మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రవేశపెడుతారు.
 • ఇకనుంచి ఒక వర్సిటీ పరిధిలోని కాలేజీలన్నీ ఒకేవిధమైన సబ్జెక్టు కాంబినేషన్లు బోధించవల్సిన అవసరం లేదు. విద్యార్థుల డిమాండునుబట్టి కోర్సుల్లో మార్పులు ఉంటాయి. 
 • అవసరాన్ని బట్టి యూజీ సిలబస్‌లో మార్పులు 
 • న్యాయ, ఆరోగ్య విద్య తప్ప మిగతా అన్నిరకాల విద్యలు ఒకే సంస్థ పర్యవేక్షణలోకి వస్తాయి.
 • ఇందుకోసం హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ)ను నెలకొల్పుతారు.   
 • అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో డిగ్రీ, పీజీ కోర్సులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది.
 • దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ ఒకేవిధమైన నియమాలు ఉంటాయి. 
 • యూనివర్సిటీల్లో కాలేజీలకు అనుబంధ గుర్తింపు 15 ఏండ్ల కాలానికి ఇస్తారు. కాలేజీలకు స్వయంప్రతిపత్తి ఇకనుంచి ఒకేసారి కాకుండా వివిధ దశలుగా ఇస్తారు. 
 • ఎంఫిల్‌ ఇక నుంచి ఉండదు. యూజీ, పీజీ, పీహెచ్‌డీలు పరస్పరాధారితంగా ఉంటాయి. విద్యాసంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉంటుంది.


కేంద్రం తెస్తున్న విద్యా విధానం అమలుకు నిధులు భారీగా పెంచాలి. దీనిపై కేంద్రం దృష్టి సారించాలి. విద్యకు నిధుల వాటా కూడా భారీగా పెంచాలి

-తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి

ఈ మార్పు ఎప్పుడో జరుగాల్సింది. విద్యార్థులు స్థానిక అంశాలపై అవగాహన కల్పించేలా సిలబస్‌ రూపకల్పన, ఇతర అంశాలపై రాష్ర్టాలకు స్వేచ్ఛ ఉండాలి.  

- ఉస్మానియా వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ తిరుపతిరావు

అన్ని కాలేజీల అఫిలియేషన్‌ విధానం రద్దు చేసి,  అటానమస్‌ కాలేజీలుగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వల్ల వెన్వెంటనే నిర్ణయాలు తీసుకుని పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయొచ్చు.

-ఉస్మానియా వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం 

నూతన విద్యా విధానంతో విద్యార్థులకు ఉపయోగాల కంటే నష్టాలే అధికం. త్రిభాషా సూత్రంలో సంస్కృతం ప్రతిపాదిస్తూ.. ఇంగ్లిష్‌ను విస్మరించడం అవివేకం.

- నాగటి నారాయణ, సెస్‌ ఛైర్మన్‌

విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామం. ఈ నిర్ణయంతో అంతర్జాతీస్థాయి వర్సిటీలకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారుతుంది. 

-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌

నూతన విద్యా విధానం మంచి నిర్ణయమే. ముఖ్యంగా 3 నుంచి 18 ఏండ్ల వరకు ఉచిత నిర్భంద విద్యను అందించే లక్ష్యంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.  

- యాదగిరి శేఖర్‌రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు


logo