శుక్రవారం 05 జూన్ 2020
National - May 16, 2020 , 02:42:15

రైతుచేతిలో పంటధర

రైతుచేతిలో పంటధర

 • నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ.. వ్యవసాయం లక్ష కోట్లు!
 • పంటను నచ్చిన చోట.. నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు
 • అన్ని కూరగాయలు, పండ్లకు ఆపరేషన్‌ గ్రీన్‌ వర్తింపు 
 • వ్యవసాయ రంగ సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు
 • మత్స్యరంగ అభివృద్ధికి రూ.20వేల కోట్లు కేటాయింపు
 • రైతు కేంద్రంగా ఆత్మ నిర్భర్‌ అభియాన్‌ మూడో విడుత

పప్పులు, తృణ ధ్యానాలు, వంటనూనె, నూనెగింజలు, ఉల్లిగడ్డ,   ఆలుగడ్డ వంటివాటి నిల్వపై నియంత్రణను ఎత్తివేస్తాం. జాతీయ విపత్తులు, కొరతతో ధరలు అనూహ్యంగా పెరుగడం వంటి అరుదైన సందర్భాల్లోనే పరిమితి విధిస్తాం. దీంతో సరుకుల నిల్వలపై పరిశ్రమలకు స్వేచ్ఛ లభిస్తుంది. లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థకు చరమగీతం పాడుతాం. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ కమిటీలకే అమ్మాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడ మంచి ధర ఉంటే అక్కడికి తరలించవచ్చు.

తమ పంటను ఎక్కడ.. ఎంత ధరకు అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. ‘ఆత్మ నిర్భర్‌ అభియాన్‌' మూడో విడుత వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం వెల్లడించారు. లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థకు చరమగీతం పాడుతామని.. రైతులు దేశంలో నచ్చిన చోట, నచ్చిన ధరకు అమ్ముకోవచ్చని ప్రకటించారు. నిల్వలపై పరిమితులను ఎత్తివేసేలా నిత్యావసర చట్టం-1955ను సవరించనున్నట్టు వెల్లడించారు. వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.1.63 లక్షల కోట్లు కేటాయించారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ఔషధ మొక్కల సాగును ప్రోత్సహించనున్నారు. పశుసంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సైతం భారీగా నిధులు కేటాయించారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న గత రెండు నెలలుగా  పంటలకు మద్దతు ధర అందిస్తూ రూ.73,300 కోట్ల కొనుగోళ్లు జరిపామని కేంద్ర మంత్రి తెలిపారు. పీఎం కిసాన్‌ ఫండ్‌ ద్వారా రైతులకు నేరుగా రూ.18,700 నగదును పంపిణీ చేసినట్టు చెప్పారు. రూ.6,400 కోట్ల పంట బీమాను చెల్లించామన్నారు. 

న్యూఢిల్లీ, మే 15: రైతులు తమ ఉత్పత్తులను నచ్చిన ధరకు.. దేశంలో ఎక్కడైనా నచ్చిన ధరకు అమ్ముకునేలా చర్యలు తీసుకోనున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకోసం ఆరున్నర దశాబ్దాలనాటి నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు చేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ మూడో దశ వివరాలను వెల్లడించారు. పప్పులు, తృణ ధ్యానాలు, వంటనూనె, నూనెగింజలు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వంటివాటి నిల్వపై నియంత్రణను ఎత్తివేస్తామన్నారు. జాతీయ విపత్తులు, కొరతతో ధరలు అనూహ్యంగా పెరుగడం వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే పరిమితి విధిస్తారని చెప్పారు. దీంతో సరుకుల నిల్వలపై పరిశ్రమలకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు. లైసెన్స్‌ రాజ్‌ వ్యవస్థకు చరమగీతం పాడుతామని మంత్రి చెప్పారు. ఇందుకోసం రాష్ర్టాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలిగిస్తామని ప్రకటించారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ కమిటీలకే అమ్మాల్సిన అవసరం లేదన్నారు. దీంతో దేశంలో ఎక్కడ మంచి ధర ఉంటే అక్కడికి తరలించవచ్చని చెప్పారు. ఈ మేరకు ఈ-ట్రేడ్‌ విధానాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. 

ఆపరేషన్‌ గ్రీన్‌ విస్తరణ 

లాక్‌డన్‌తో సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో కూరగాయలు, పండ్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని అరికట్టేందుకు ‘ఆపరేషన్‌ గ్రీన్‌' పథకాన్ని వీటికి సైతం వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం ఈ పథకం టమాట, ఉల్లిగడ్డ, ఆలుగడ్డలకే పరిమితమైంది. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో మిగులు నుంచి లోటు మార్కెట్లకు సరుకు రవాణాపై, కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చార్జీలో 50 శాతం రాయితీ ఇస్తారు. ఈ పథకం ప్రాథమికంగా ఆరు నెలలపాటు కొనసాగనున్నది.

పశు సంవర్ధక రంగానికి 15వేల కోట్లు

 • లాక్‌డౌన్‌ సమయంలో పాల డిమాండ్‌ 20-25 శాతం తగ్గిందని, పాడి రైతులను ఆదుకునేందుకు మిగులు పాలను సహకార సంఘాల ద్వారా సేకరించామని నిర్మల తెలిపారు. రెండు నెలలుగా రోజూ 5.6 కోట్ల లీటర్లు సేకరించామని, ఇందులో 3.6 కోట్ల లీటర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయన్నారు. ఇప్పటివరకు అదనంగా సేకరించిన 111 కోట్ల లీటర్ల ద్వారా రైతులకు రూ.4,100 కోట్లు అందాయన్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘాల రుణాలపై ఏడాదిపాటు 2 శాతం వడ్డీ రాయితీ ప్రకటించారు. దీంతో రెండు కోట్ల మందికి రూ.5వేల కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 
 • పశు సంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.15వేల కోట్లతో నిధి ఏర్పాటు. వీటితో మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు డెయిరీ ప్రాసెసింగ్‌, మేత తయారీ రంగంలోకి ప్రైవేట్‌ పెట్టుబడులు ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తారు. పాలను ఎగుమతి చేసేందుకు వీలుగా ప్లాంట్లు నెలకొల్పడానికి ప్రోత్సాహకాలు అందించనున్నారు. 
 • రూ.13,343 కోట్లతో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (నేషనల్‌ యానిమల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌) ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 53 కోట్ల పశువులకు (ఆవులు, ఎడ్లు, బర్రెలు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు, పందులు) మూతి, కాళ్లకు వచ్చే వ్యాధుల నివారణకు టీకాలు వేస్తారు. ఇప్పటివరకు 1.5 కోట్ల ఆవులు, బర్రెలకు టీకాలువేశారు.


సాగుకు మౌలిక  సదుపాయాలు 

 • వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించారు. కోతల నుం చి ఉత్పత్తులు వినియోగదారుడి వరకు చేరే క్రమంలో కావాల్సిన వసతులు (కోల్డ్‌ చెయిన్‌) సరిపడా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంతో గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు వంటి వసతులు కల్పిస్తామన్నా  రూ.లక్ష కోట్ల నిధులతో  రైతులు,  రైతుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోలు), వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.  
 • స్థానిక ఆహారోత్పత్తుల ఆధారంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, వాటికి అంతర్జాతీయ మార్కెటింగ్‌ వసతి కల్పించడంతో ఆహా ర రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు (ఎంఎఫ్‌ఈ) రూ.10వేల కోట్లు కేటాయించారు. దీంతో 2 లక్షల పరిశ్రమలకు లబ్ధి కలుగుతుంది. 
 • ఔషధ మొక్కల సాగుకు రూ.4వేల కోట్లు కేటాయించారు. సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు.  గంగా నదీ తీరం వెంబడి 800 హెక్టార్లలో ఔషధ మొక్కలు పెంచుతామన్నారు. కాగా,  తేనెటీగల పెంపకానికి రూ.500 కోట్లు కేటాయించగా, 2 లక్షల మంది రైతులకు ఉపకరించనున్నది.

మత్స్యరంగానికి 20వేల కోట్లు 

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకానికి రూ.20వేల కోట్లు కేటాయించారు. ఇందులో రూ.11వేల కోట్లను నదులు, సముద్రం, చెరువుల్లో మత్స్య సంపద అభివృద్ధికి వినియోగిస్తారు. మరో రూ.9వేల కోట్లతో ఫిష్షింగ్‌ హార్బర్లు, కోల్డ్‌ చెయిన్‌, మార్కెట్ల నిర్మిస్తారు. మత్స్యరంగంలో 55 లక్షల మందికి ఉపాధి కల్పించడంతోపాటు ఎగుమతులను రెట్టింపు చేసి రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ సాధిస్తామన్నారు. 

ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ ఉత్తదే. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ అం తా గందరగోళం. ప్రధాని ఒకటి చెప్తే ఆర్థికమంత్రి మరొకటి ప్రకటిస్తున్నా రు. దీని వల్ల సామాన్యుడికి, రాష్ర్టాలకు ఒరిగేదేమీ లేదు. మోదీ సర్కార్‌ తీకెతో రాష్ర్టాలు కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది. నిధులు లేనప్పుడు కేంద్రం నోట్ల ముద్రణకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? 

- అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంఐఎం అధినేత 


logo