శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 16:04:44

ముగ్గురికి మాత్రమే కొవిడ్‌-19 లక్షణాలు: కేంద్రం

ముగ్గురికి మాత్రమే కొవిడ్‌-19 లక్షణాలు: కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌లో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఉన్నతస్థాయి కమిటీ అధికారికంగా వెల్లడించింది. కరోనాపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల ఉన్నతస్థాయి కమిటీ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించింది. పుకార్లను ప్రజలు నమ్మకూడదని ఈ సందర్భంగా ఉన్నతస్థాయి కమిటీ మీడియాముఖంగా తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 15,991 మంది అనుమానితులను పరిశీలించినట్లు కేంద్ర కమిటీ వెల్లడించింది. వారిలో 1671 మంది కరోనా అనుమానితుల రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు.. ముగ్గురికి మాత్రమే ఆ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు కేసులు కేరళలోనే నమోదైనట్లు కేంద్ర మంత్రుల కమిటీ తెలిపింది. చైనాలోని వుహాన్‌ నగరం నుంచి వచ్చిన 645 మందిని వైద్య శిబిరాల్లో పరిశీలనలో ఉంచినట్లు కమిటీ తెలిపింది.

చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రతి రోజు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కమిటీ వెల్లడించింది. ఇప్పటివరకు 21 విమానాశ్రయాల్లో 2.49 లక్షల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించినట్లు కేంద్ర కమిటీ వివరించింది. విమానాశ్రయాలతో సహా అతర్జాతీయ పోర్టులు, నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కూడా స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలియజేసింది. కొవిడ్‌-19పై పరిశోధనల బాధ్యత పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు అప్పగించినట్లు కమిటీ తెలిపింది. కాగా, ఇదివరకే చాలా రాష్ర్టాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో ఐసోలేట్‌ వార్డులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రుల కమిటీ వివరించింది.


logo