బుధవారం 27 మే 2020
National - May 10, 2020 , 00:38:53

లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ ప్రేమ

లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ ప్రేమ

  • డేటింగ్‌ యాప్‌లకు భారీగా పెరిగిన ఆదరణ
  • లాక్‌డౌన్‌తో పెరిగిన వలపు ముచ్చట్లు 
  • కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న సంస్థలు

లాక్‌డౌన్‌ పుణ్యమా అని యువకులు రోడ్ల మీదికొచ్చి ‘ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా’ అంటూ నెచ్చెలి కోసం వెతికే పరిస్థితి లేదు. ‘ఇతడే.. నే కలగన్న నా వరుడు’ అంటూ యువతులు మనసుపారేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రేమ కోసం ‘ఆన్‌లైన్‌' బాట పట్టారు.  లాక్‌డౌన్‌తో కలిగిన ఒంటరితనాన్ని డిజిటల్‌ ప్రేమతో చెరిపివేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదే అదునుగా డేటింగ్‌ యాప్‌లు సైతం కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్నాయి. ఫలితంగా రెండు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా డేటింగ్‌ యాప్‌ల పంట పండుతున్నది. 

వర్చువల్‌ మీటింగ్స్‌ 

ఫ్లోష్‌, సిర్ఫ్‌ కాఫీ, మైస్కూట్‌ వంటి స్టార్టప్‌ సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నాయి. చాటింగ్‌లకే పరిమితం కాకుండా జూమ్‌ యాప్‌తో జతకట్టి ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నాయి. ఫీజు చెల్లించిన వినియోగదారులు ఇంట్లో కాఫీ కప్పు చేతిలో పట్టుకొని జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. అంటే చాయ్‌ దుకాణంలో మీటింగ్‌ వంటిదన్నమాట. లాక్‌డౌన్‌లో కొత్త వినియోగదారుల సంఖ్య 20% పెరిగిందని ఆయా సంస్థలు చెప్తున్నాయి. ఇందులో బ్యాంకర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వంటివారే ఎక్కువగా ఉన్నారని తెలిపాయి.


సరిహద్దులు దాటేసి.. 

ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టే డేటింగ్‌ యాప్‌లు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. టిండర్‌ యాప్‌ ‘పాస్‌పోర్ట్‌', ఒకే క్యూపిడ్‌ యాప్‌ ‘ఎనీవేర్‌' ఫీచర్లు దీనికి ఉదాహరణలు. సాధారణంగా డేటింగ్‌ యాప్‌లలో మనం ఉన్న నగరానికి చెందిన వ్యక్తులతో మాత్రమే పరిచయం పెంచుకునే పరిమితులుండేవి. కానీ.. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ల ద్వారా మనకు నచ్చిన దేశంలో, నచ్చిన నగరంలో మన లొకేషన్‌ను పింగ్‌ చేసుకోవచ్చు. తద్వారా అక్కడి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. లాక్‌డౌన్‌ కాలంలో పాస్‌పోర్ట్‌, ఎనీవేర్‌ ఫీచర్లు వాడేవారి సంఖ్య భారత్‌లో 25 శాతం పెరిగిందని ఆయా సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా విదేశీ వ్యక్తుల పరిచయాలు కోరుకునే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు చెప్పాయి. అంతేకాకుండా ‘మొదటి రోజు చాటింగ్‌.. రెండో రోజు డేటింగ్‌' అనే ధోరణికి క్రమంగా స్వస్తి పలుకుతున్నారని, ‘స్లో డేటింగ్‌' సంస్కృతి పెరుగుతున్నదని గణాంకాలు చెప్తున్నాయి. 

తోడు కోసం వెతుకులాట 

లాక్‌డౌన్‌ వల్ల నాలుగు గోడలకే పరిమితమైన ఒంటరిపక్షులు తోడు కోసం డేటింగ్‌ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో కొత్తవారిని పరిచయం చేసుకోవడం, అన్ని విషయాలను పంచుకునే అవకాశం, అభిరుచులు కలిస్తే మనసులు ఇచ్చిపుచ్చుకొనే సౌలభ్యం ఉండటం వారికి కలిసివస్తున్నది. ఒంటరితనంలో ఓదార్పును కోరుకునేవారు సైతం ఈ యాప్‌ల బాట పడుతున్నారు. ఈ ఏడాది మార్చిలో అన్ని డేటింగ్‌ యాప్‌లలో జంటగా మారిన వారి సంఖ్య సగటున 10-15 శాతం పెరిగింది. ‘మార్చి 29న మా యాప్‌లో 300 కోట్ల స్వైప్‌లు (తోడు కోసం వెతుకడం) నమోదయ్యాయి. ఇదో రికార్డు’ అని టిండర్‌ యాప్‌ ప్రతినిధి తెలిపారు.


logo