గురువారం 29 అక్టోబర్ 2020
National - Aug 30, 2020 , 01:11:59

జమిలి ఎన్నికలపై కసరత్తు!

జమిలి ఎన్నికలపై కసరత్తు!

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశమంతటా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. తన ఎజెండాలోని ఒక్కో అంశాన్నీ పూర్తి చేసుకుంటూ వస్తున్న మోదీ సర్కార్‌.. తాజాగా జమిలి ఎన్నికలపై కసరత్తును ప్రారంభించింది. దీంట్లో భాగంగా.. లోక్‌సభ, అసెంబ్లీ, లోకల్‌బాడీలకు ఒకే ఓటర్ల జాబితాను సిద్ధం చేసే అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ నెల 13న జరిగిన ఈ సమావేశంలో ఏకీకృత జాబితా తయారీపై రెండు అవకాశాల గురించి చర్చించినట్టు జాతీయ మీడియా శనివారం వెళ్లడించింది. ఏకీకృత ఓటర్‌ లిస్టు తయారీ కోసం రాజ్యాంగంలోని 243కే, 243జెడ్‌ఏ ఆర్టికల్స్‌కు సవరణలు చేయటం మొదటి అంశం కాగా, భారత ఎన్నికల సంఘం (ఈసీ) రూపొందించే ఓటర్ల జాబితానే మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలకు కూడా తీసుకోవాలని రాష్ర్టాలను కోరటం రెండో అంశం.

బీజేపీ ఎన్నికల హామీ 

ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీలకు ఓటర్‌ లిస్టును ఈసీ రూపొందిస్తుండగా, స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ర్టాల ఎన్నిక సంఘాలు ఓటర్‌ జాబితాను సిద్ధం చేస్తున్నాయి. వీటి మధ్య చాలా తేడాలు ఉంటుండటంతో వివాదాలు ఏర్పడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కామన్‌ ఓటర్‌ లిస్టు తయారుచేస్తామని బీజేపీ తన ఎన్నికల హామీల్లో పేర్కొంది. జమిలి సులువు కాదు 

కామన్‌ ఓటర్‌ లిస్టు తయారు చేసినంత తేలికగా పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్‌బాడీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం సాధ్యంకాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటే ఐదేండ్లకోసారి అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించటానికి అన్ని రాష్ర్టాలను ఒప్పించటమే కాక విశాల దృష్టితో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుందని మాజీ ఎన్నికల కమిషనర్లు పేర్కొంటున్నారు. పలు రాష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్నందున.. ఏకాభిప్రాయ సాధన కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.